జయ ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారా?

Jaya Refused To Go To Hospital, says Sasikala  - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం విషయమై ఆమె నెచ్చెలి శశికళ పలు కీలకమైన విషయాలు వెల్లడించారు. 2016 సెప్టెంబర్‌ 22న జయలలిత వాష్‌రూమ్‌లో కుప్పకూలారని, అయినా, ఆస్పత్రికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారని శశికళ తెలిపారు. అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతుండగా.. నాలుగుసార్లు వీడియో చిత్రీకరించారని, ఆస్పత్రిలో ఆమెను పన్నీర్‌ సెల్వం, తంబిదురై వంటి అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు కలిశారని చెప్పారు. జయలలిత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరుపుతున్న రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలోని విచారణ కమిషన్‌కు ఆమె ఈ మేరకు వివరాలు తెలిపారు. అయితే, ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను తాము కలువలేదని, చూడలేదని పన్నీర్‌ సెల్వం, తంబిదురైతోపాటు అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే.

జయలలిత మృతికి దారితీసిన పరిస్థితులు, ఆమెకు అందజేసిన చికిత్స తదితర అంశాల్లో అనుమానాల నివృత్తి కోసం హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ ఏ అరుముఘస్వామి నేతృత్వంలో దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ.. జయ మృతికి దారితీసిన పరిస్థితులను రిటైర్డ్‌ జడ్జికి వివరించారు.  2016 సెప్టెంబర్‌ 22న జయలలిత అనారోగ్యానికి గురయ్యారని, అదే రోజున ఆమెను ఆస్పత్రిలో చేర్చామని శశికళ చెప్పారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. జయలలిత స్పృహలోకి వచ్చారని, తనను ఎక్కడికి తీసుకెళుతున్నారని ఆమె ప్రశ్నించారని తెలిపారు. పోయెస్‌ గార్డెన్‌లో ఉన్న తన నివాసంలోని మొదటి అంతస్తు వాష్‌రూమ్‌లో జయలలిత సృహకోల్పోయి పడిపోయారని చెప్పారు. ‘ఆమె వెంటనే నన్ను సాయానికి పిలిచారు. నేను వెళ్లి ఆస్పత్రికి వెళ్దామని సూచించాను. కానీ ఆమె వద్దన్నారు. అంతలో ఆమె స్పృహ కోల్పోవడంతో నేనే అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేశాను’ అని శశికళ వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top