ప్రకృతి వైపరీత్యాలను రాజకీయలబ్ధికి వాడొద్దు

IYR Krishna Rao Slams TDP Over Thithili Cyclone - Sakshi

ఏపీ మాజీ చీఫ్‌ సెక్రటరీలు  ఐవైఆర్‌ కృష్ణారావు, అజయ్‌ కల్లం 

హైదరాబాద్‌: ప్రకృతి వైపరీత్యాలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవద్దని, తుఫాను సంభవించినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటించి స్థానిక అధికార యంత్రాగాన్ని ఇబ్బందులకు గురి చేయొద్దని ఏపీ మాజీ చీఫ్‌ సెక్రెటరీలు ఐవైఆర్‌ కృష్ణారావు, అజయ్‌ కల్లం అన్నారు. జన చైతన్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణారావు మాట్లాడుతూ 2005లో ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టాన్ని కేంద్రం రూపొందించి అమలులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మూడేళ్లుగా రూ.1,250 కోట్లను ప్రకృతి విపత్తుల నివారణ కోసం కేంద్రం ఇచ్చిందనీ, అయినా, తిత్లీతుఫాను విషయంలో కేంద్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.

కేంద్రం పంపిన బృందం నివేదిక అందగానే వెంటనే నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. కాగా, తుఫాను సందర్భంగా కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ నిధులను పెద్దెత్తున ప్రచార కార్యక్రమాలకు వెచ్చించడం విచారకరమన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ కల్లం మాట్లాడుతూ  సీఎం ఒకరోజు జిల్లాలో పర్యటిస్తే రూ.25 లక్షల ఖర్చువస్తుందని, తుఫాను వచ్చిన ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తే ప్రజాధనం వృ«థా కావడమే కాకుండా పోలీసులు, అధికార యంత్రాంగం సీఎం చుట్టూ తిరుగుతారే కానీ, వరదబాధితులకు ఏం సాయం చేస్తారని ప్రశ్నించారు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ శ్రీకాకుళంలో సంభవించిన తిత్లీ తుఫాను గ్రామాలు విద్యుత్‌ లేకుండా చీకట్లో జీవిస్తున్నాయని పేర్కొన్నారు.  తిత్లీ తుఫాను ప్రభావం నుండి ఒడిశా వారంలో కోలుకుంటే హైటెక్‌ సీఎం గా చెప్పుకునే చంద్రబాబు పూర్తిగా విఫలమై ఆ లోపా న్ని కేంద్రంపై రుద్దేందుకు చూస్తున్నారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top