ఐటీ అదరహో

Information Technology sector in ysr ruling - Sakshi

వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ)   రంగం పరుగులు పెట్టింది. ఏటా ఐటీ ఎగుమతులు రెట్టింపు అవుతుండటమే కాకుండా.. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడప, వరంగల్‌ వంటి పట్టణాలకు సైతం విస్తరించారు. ఈ సమయంలో కాగ్నిజెంట్,  టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పాటు మైక్రోసాఫ్ట్‌ మూడో దశ, విప్రో రెండో దశ పనులు మొదలయ్యాయి. అంతేకాదు ఆయన హయాంలో యూఎస్‌ కాన్సిలేట్‌ ఏర్పాటు కావడంతో అమెరికాకు వెళ్లే ఐటీ విద్యార్థులు, ఉద్యోగులకు కలిసొచ్చింది. వైఎస్‌ హయాంలోనే 50 వేల ఎకరాల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఆర్‌) ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది.

వైజాగ్, కాకినాడ, తిరుపతి, కడప, వరంగల్‌ పట్టణాలకు ఐటీ విస్తరణ
వైఎస్‌ హయాంలో రూ.5,025కోట్లనుంచి రూ. 33,482కోట్లకుచేరిన ఎగుమతులు
వైఎస్‌ హయాంలో 85,000నుంచి 2,85,000 దాటిన ఉద్యోగుల సంఖ్య

సాక్షి, అమరావతి : వైఎస్‌ హయాంలో ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి నమోదైంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన నాటికి ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.5,025 కోట్లు మాత్రమే.. వైఎస్‌ అధికారం చేపట్టాక ఐటీ ఎగుమతులు వేగం పుంజుకున్నాయి. ఏటా సుమారు రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తూ 2009–10 నాటికి రూ.33,482 కోట్లకు చేరాయి. అలాగే బాబు తొమ్మిదేళ్ల పాలనలో 900 ఐటీ కంపెనీలొస్తే.. వైఎస్‌ ఐదేళ్ల పాలనాకాలంలో ఏకంగా 1,400కు పైగా కంపెనీలు రావడం గమనార్హం.

ఇదే సమయంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. బాబు హయాంలో ఐటీ రంగం ద్వారా 85,000 మందికి ఉపాధి లభిస్తే.. వైఎస్‌ శకం ముగిసే నాటికి 2,85,000 మందికి మించి ఉపాధి లభించింది. వైఎస్‌ చనిపోవడానికి రెండేళ్ల ముందు నుంచి ఐటీ ఉద్యోగుల కల్పనలో ఏకంగా 50 శాతానికి పైగా వృద్ధి నమోదయ్యేది. ఈ స్థాయి వృద్ధిని ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందిపుచ్చుకోలేదు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top