కలపకుంటే తిరుగుబాటే

India has job problem but PM Modi refuses to acknowledge - Sakshi

అభివృద్ధిలో అన్నివర్గాల భాగస్వామ్యంపై రాహుల్‌

న్యూఢిల్లీ: మెజారిటీ ప్రజలను అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు చేయకుంటే ప్రపంచంలో ఎక్కడైనా తిరుగుబాటు చెలరేగే అవకాశముందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలిపారు. భారత్‌లో ప్రధాని మోదీ ప్రభుత్వం ఆదివాసీలు, దళితులు, మైనారిటీలను ఇదే తరహాలో అభివృద్ధికి దూరంగా ఉంచుతోందన్నారు. జర్మనీలోని హాంబర్గ్‌లో ఉన్న బుసెరియస్‌ సమ్మర్‌ స్కూల్‌లో బుధవారం జరిగిన ఓ సదస్సులో రాహుల్‌ మాట్లాడారు. ‘2003లో అమెరికా–ఇరాక్‌ యుద్ధం తర్వాత ఇరాక్‌లో ఓ తెగ వారిని ప్రభుత్వ ఉద్యోగాలు, సైన్యంలో తీసుకోకుండా నిషేధిస్తూ చట్టం తెచ్చారు.

దీంతో ఆ తెగవారు తిరుగుబాటుదారుల్లో చేరిపోయారు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఈ తిరుగుబాటుదారులు సిరియాకూ విస్తరించారు. చివరికి అదే ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా(ఐసిస్‌) వంటి అంతర్జాతీయ ఉగ్రసంస్థగా రూపాంతరం చెందింది’ అని రాహుల్‌ అన్నారు. మహిళలకు ప్రపంచంలోనే భారత్‌ ప్రమాదకరమైన దేశమన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కానీ దేశంలో మహిళల పట్ల దారుణాలు పెరిగిపోతున్నాయని అంగీకరించారు.  ‘భారత్‌ మారాల్సిన అవసరం ఉంది. పురుషులు మహిళలను గౌరవంతో, తమతో సమానంగా చూడాలి. కానీ ఇది ప్రస్తుతం భారత్‌లో జరగడం లేదు’ అని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు

నిరుద్యోగం కారణంగా మూకహత్యలు
నిరుద్యోగం, పేదలకు సమాన అవకాశాలు రాకపోవడం కారణంగా ప్రజల్లో ఏర్పడిన ఆగ్రహంతోనే దేశంలో మూకహత్యలు జరుగుతున్నాయని రాహుల్‌ అన్నారు. కేంద్రం అనాలోచితంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, దుందుడుకుగా తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ)కారణంగా చిన్న వ్యాపారాలు నాశనమైపోయాయని దుయ్యబట్టారు. మరోవైపు, జర్మనీలో జరిగిన సదస్సులో మహిళల భద్రత విషయంలో భారత్‌ను కించపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. దేశంలోని ముస్లింలకు ఉద్యోగాలు కల్పించకుంటే వారంతా ఇస్లామిక్‌ స్టేట్‌లో చేరతారన్నట్లు రాహుల్‌ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top