మాటల కూటమి.. పోటీ సెపరేట్‌

Huzurnagar Bypoll No Alliance Between Congress TDP CPI And TJS - Sakshi

పురుడు పోసుకున్న ఏడాదిలోపే విచ్ఛిన్నమైన కూటమి

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ఎవరికివారే యమునా తీరే..

సాక్షి, హైదరాబాద్‌ : మహాకూటమి.. ఉపఎన్నిక దెబ్బకు విచ్ఛిన్నమైంది. కాంగ్రెస్‌ పెద్దన్న పాత్రలో సీపీఐ, టీజేఎస్, టీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీల కలయికగా పురుడు పోసుకుని ఏడాది గడవకముందే బతికి బట్టకట్టలేకపోయింది. ఈ నెల 21న జరగనున్న హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ‘ఎవరికివారే యమునా తీరే’అనే రీతిలో వ్యవహరించబోతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రాజకీయ శక్తులను ఏకం చేయాలనే ఎజెండాతో రూపొందించిన ఈ కూటమి ప్రస్థానం హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల వేళ ప్రశ్నార్థకంగా మిగిలింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

తలోదారిన..
గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సహకరించుకున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, ఇంటి పార్టీలు తలోదారి పట్టాయి. కాంగ్రెస్, టీడీపీలు తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. తెలంగాణ ఇంటి పార్టీ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. సీపీఐ కూడా కూటమి నుంచి జారుకునే ప్రయత్నాల్లో ఉంది. మొన్నటివరకు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్న సీపీఐ నేతల స్వరంలో ఉన్నట్టుండి మార్పు కనిపించింది. 

తమకు మద్దతివ్వాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ నేతలు సీపీఐ కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపే వరకు సీన్‌ వెళ్లింది. అప్పటికే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సీపీఐ కార్యాలయానికి వెళ్లి మద్దతు అభ్యర్థించారు కూడా. కానీ, సీపీఐ మాత్రం టీఆర్‌ఎస్‌ నేతలకు కూడా చర్చలకు అవకాశమివ్వడం, మరోసారి కాంగ్రెస్‌ నేతలు కలిసినా ఖచ్చితమైన నిర్ణయం చెప్పకపోవడం బట్టి చూస్తే ఆ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చే యోచనలో లేదని అర్థమవుతోంది. 

తాము పోటీ చేయకూడదని ఇప్పటికే నిర్ణయించుకున్న ఆ పార్టీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థన మేరకు అధికార పక్షాన్ని అక్కున చేర్చుకుంటుందని తెలుస్తోంది. కూటమిలో మరో భాగస్వామ్యపక్షమైన టీజేఎస్‌ కూడా కాంగ్రెస్‌పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించలేకపోతోంది. టీజేఎస్‌ నేతలు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెబుతూనే ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేస్తామంటున్నారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తారా అంటే పార్టీలో చర్చించాల్సి ఉందని అంటున్నారు. ఏతావాతా మహాకూటమిలో టీజేఎస్‌ మాత్రమే కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

కారణాలేంటి?
ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాజయంతో అప్పుడే కూటమి కుదేలయిపోయింది. తాము ఆశించిన దానికి పూర్తి భిన్నంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ఆ పరాజయం నుంచి కోలుకునేందుకే కూటమి నేతలకు చాలా కాలం పట్టింది. కోలుకున్న తర్వాత కూడా అడపాదడపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళన కార్యక్రమాల్లో వేదికలు పంచుకోవడం తప్ప ఆ పార్టీలు పెద్దగా కలిసిన సందర్భాలు లేవు. కనీసం ఎన్నికల్లో పరాజయాన్ని కూటమిగా సమీక్షించుకున్న దాఖలాలు కూడా లేవు. 

కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కూటమికి సిద్ధాంతమేమీ లేదని, కేవలం టీఆర్‌ఎస్‌ను ఓడించి గద్దెనెక్కాలనే ఆలోచనతోనే జట్టు కట్టారనే విమర్శలు అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్‌ కూడా ఆ తర్వాత ఇతర పక్షాలను పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు పట్ల భాగస్వామ్యపక్షాలు గుర్రుగానే ఉండేవి. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలు మొక్కుబడిగా మద్దతు ఇచ్చి పుచ్చుకున్నాయి. దీంతో ఇప్పటివరకు పేరుకు మాత్రమే కూటమిగా ఉన్న ఆ పార్టీల అనైక్యత హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలతో తేటతెల్లమైంది. 4 పార్టీలు నాలుగు దారులు వెతుక్కుని తలో గూటికి చేరుకోవడం గమనార్హం. 

కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందా?
కూటమిలో చీలిక హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అన్ని పార్టీల సహకారంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 7,500 పైచిలుకు మెజార్టీతో గట్టెక్కారు. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన నేపథ్యంలో దాని ప్రభావం ఎలా ఉంటుందనేది హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం, సీపీఐల ఓటు బ్యాంకు పకడ్బందీగా ఉందా? ఉంటే ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుచూపేది? ఒకవేళ ఈ పార్టీలు కలిసి ఉన్నా ఆ ఓట్లన్నీ కాంగ్రెస్‌ అభ్యర్థికి పడేవా? నియోజకవర్గంలో పరిస్థితి ఏంటన్న దానిపై రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. 

దీనిపై ఓ అంచనాకు రావడం అప్పుడే సాధ్యం కాకపోయినా టీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీ మద్దతుతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినా అవి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే కనుక కాంగ్రెస్‌కు ఆ మేరకు నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పార్టీలు కలిసి ఉన్న కారణంగా గత ఎన్నికల్లో ఉత్తమ్‌కు పడాల్సిన ఓట్లు కూడా పడలేదని, ముఖ్యంగా టీడీపీ కలయికతో తెలంగాణవాదులు దూరమయ్యారని, ఇప్పుడు ఆ ఓట్లు కొంత కలిసివస్తాయని కూడా అంటున్నారు. మొత్తం మీద కూటమి చీలిక కాంగ్రెస్‌ను కష్టాలపాలు చేస్తుందా..? మారిన రాజకీయ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌కు ఏమైనా నష్టం చేస్తుందా అన్నది డిసెంబర్‌ 24న వెలువడే ఫలితం తేల్చనుంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top