బీజేపీకి బిందాల్‌ రాజీనామా ఎందుకు?

Himachal Pradesh BJP Chief Rajeev Bindal Resigns - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశాన్ని కరోనా వైరస్‌ కుదిపేస్తున్న నేపథ్యంలో వైరస్‌ల బారిన పడకుండా రక్షించుకునేందుకు వైద్య సిబ్బంది ధరించే ‘పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఇక్వీప్‌మెంట్‌ (వ్యక్తిగత రక్షణ పరికరాలు)’ సేకరణలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై హిమాచల్‌ప్రదేశ్‌ ‘డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌’ అజయ్‌ గుప్తాను మే 22వ తేదీన పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయిదు రోజుల అనంతరం ‘నాపై ఏ రకమైన ఒత్తిడి లేకపోయినప్పటికీ, కేసుపై ఎలాంటి ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఉన్నతాశయాలకు కట్టుబడి నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజీవ్‌ బిందాల్‌ రాజీనామా చేశారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే.

వైద్య రంగానికి చెందిన కొనుగోళ్లు చేయడానికి ఇతర రాష్ట్రాల్లోలాగా హిమాచల్‌కు ప్రత్యేక వైద్య కొనుగోళ్ల కార్పొరేషన్‌ అంటూ ఏదీ లేదు. అందుకని అజయ్‌ గుప్తా నాయకత్వంలో ఏర్పాటైన సాంకేతిక కమిటీయే కొనుగోళ్ల వ్యవహారాలు చూస్తోంది. కరోనా అత్యయిక పరిస్థితి కారణంగా ఎలాంటి బిడ్డింగ్‌లను పిలువకుండా చండీగఢ్‌లోని ‘బయోఏడ్‌ కార్పొరేషన్‌’ నుంచి 84 లక్షల రూపాయలకు ఆరువేల పీపీఈలు, కురుక్షేత్రంలోని ‘బన్సాల్‌ కార్పొరేషన్స్‌’ నుంచి 73.5 లక్షల రూపాయలకు ఏడువేల పీపీఈలు కమిటీ ఆధ్వర్యంలో అజయ్‌ గుప్తా కొనుగోలు చేశారు.

ఇంతలో పృధ్వీసింగ్‌ అనే వ్యక్తి నుంచి ఐదు లక్షల రూపాయలు లంచంగా తీసుకొని ఆయనకు పీపీఈల కొనుగోలు కాంట్రాక్ట్‌ ఇచ్చినట్లు ఓ ఆడియో వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు దర్యాప్తును చేపట్టిన ‘స్టేట్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌ బ్యూరో’ పోలీసులు మే 22వ తేదీన గుప్తాను అరెస్ట్‌ చేశారు. లంచం తీసుకున్న వారితోపాటు లంచం ఇచ్చిన వారు కూడా నేరస్థులేనని, కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని దర్యాప్తు విభాగం పోలీసు సూపరిండెంటెంట్‌ షాలినీ అగ్ని హోత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా మీడియాకు తెలిపారు. ఈ కేసులో నేటికి కూడా పృధ్వీసింగ్‌ను అరెస్ట్‌ చేయక పోవడమే అసలైన వార్త. అసలు ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? ఆయనకు బీజేపీ పదవికీ రాజీనామా చేసిన రాజీవ్‌ బిందాల్‌కు సంబంధం ఏమైనా ఉందా?! (అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు!)

రాజీవ్‌ బిందాల్‌కు సబంధం ఏమిటీ?
రాజీవ్‌ బిందాల్‌ కూతురు స్వాతీ బిందాల్‌ గాంధీ, అల్లుడు రాజ్‌కుమార్‌ గాంధీలు కలిసి సోలన్‌లో ‘అపెక్స్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌’ నిర్వహిస్తున్నారు. వారి బిజినెస్‌ కార్డులపై భార్యభర్తలైన ఇద్దరు గాంధీల పేర్లతోపాటు మార్కెటింగ్‌ మేనేజర్‌గా ‘పృధ్వీ సింగ్‌’ పేరుంది. ఆడియోలో గుప్తాతో మాట్లాడిన పృధ్వీ సింగ్‌ ఈయనేనని, పృధ్వీ సింగ్, ఆడియో టేపులోని స్వరం ఒకలాగే ఉన్నాయంటూ స్థానిక పత్రికలు ఆరోపించగా, తమకు సంబంధం లేదంటూ ముగ్గురు ఖండించారు. ప్రాథమిక ఆధారాలు పరిగణలోకి తీసుకొని పృధ్వీ సింగ్‌ను అరెస్ట్‌ చేసి, విచారించాల్సిన పోలీసులు, ఆయన జోలికి వెళ్లడం లేదు. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.

73 లక్షల రూపాయల పీపీఈ పరికరాలను సరఫరా చేసిన ‘బన్సాల్‌ కార్పొరేషన్‌’ అనే సంస్థనే కురుక్షేత్రలో లేదు. కాకపోతే ఆ పేరును పోలిన ‘బన్సాల్‌ సేల్స్‌ కార్పొరేషన్, బన్సాల్‌ పాలిమర్స్‌’ అనే రెండు సంస్థలు ఉన్నాయి. ఆ రెండు కంపెనీలు కూడా పీపీఈలను హిమాచల్‌కు సరఫరా చేయలేదని స్పష్టం చేశాయి. పైగా ఆ రెండు కంపెనీలు పీపీఈలనే ఉత్పత్తి చేయడం లేదు. పృధ్వీ సింగ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని మీడియా ప్రశ్నలకు పోలీసు అధికారులు మౌనం పాటిస్తుండగా, బీజేపీ నేత రాజీవ్‌ బిందాల్‌ తనకేమి సంబంధం లేదని ముక్తిసరిగా చెబుతూ బిజీ బిజీ అంటూ మొహం చాటేస్తున్నారు.

పృధ్వీ సింగ్‌కు, రాజీవ్‌ బిందాల్‌కు సంబంధం లేకుండా బీజీపీ అధ్యక్ష పదవికి బిందాల్‌ ఎందుకు రాజీనామా చేశారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుల్దీప్‌ రాథోడ్, హిమాచల్‌ సీపీఎం శాసన సభ్యుడు రాకేష్‌ సింగా ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాశయాలకు కట్టుబడి రాజీనామా చేశానని బిందాల్‌ స్పష్టం చేశారు. వైద్య పరికరాల సేకరణలో అవినీతి జరిగితే ఉన్నత ఆశయాల మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాలిగానీ బిందాల్‌ రాజీనామా చేయడం ఎందుకు?! (భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top