29న సీఎంగా హేమంత్‌ ప్రమాణం

Hemant Soren to take oath as CM on Dec 29 - Sakshi

జేఎంఎం శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన హేమంత్‌ సోరెన్‌

రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్‌ ముక్తిమోర్చా(జేఎంఎం) నేత హేమంత్‌ సోరెన్‌(44) ఈ నెల 29వ తేదీన జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం హేమంత్‌ సోరెన్, సంకీర్ణంలోని కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) తదితర పార్టీల నేతలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ద్రౌపది ముర్మును కలిశారు. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా గవర్నర్‌ అంగీకరించారని, ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అనంతరం హేమంత్‌ సోరెన్‌ తెలిపారు.

పౌరసత్వ సవరణ చట్టంపై ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ..ఈ చట్టం కారణంగా తమ రాష్ట్రంలోని ఏ ఒక్కరికి నష్టం జరిగే అవకాశమున్నా అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతకుముందు జేఎంఎం ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ వర్కింగ్‌గా ఉన్న ప్రెసిడెంట్‌ హేమంత్‌ సోరెన్‌ను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్, ఆర్జేడీ నేతలతోపాటు కూటమికి మద్దతు ప్రకటించిన జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా(ప్రజాతాంత్రిక్‌) చీఫ్‌ బాబూలాల్‌ మరాండీతో కూడా సమావేశం అయ్యారు. ఎన్నికలకు ముందే ఏర్పాటైన జేఎంఎం– కాంగ్రెస్‌– ఆర్జేడీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్‌ సోరెన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో శాసనసభలోని 81 స్థానాలకు గాను సంకీర్ణానికి 47 సీట్లు దక్కిన విషయం తెలిసిందే.

బీజేపీ క్షీణతకు నిదర్శనం జార్ఖండ్‌:పవార్‌  
ముంబై: దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాభవం తగ్గుతోందని జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం నేత, జార్ఖండ్‌ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు  శరద్‌ పవార్‌ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై హేమంత్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ..మహారాష్ట్రలో పవార్‌ సాగించిన పోరాటం తమకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top