రాజీనామాకు నేను సిద్ధమే

HD Kumaraswamy offers to quit as Karnataka CM - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.సోమశేఖర మాట్లాడుతూ..‘రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. అదే సిద్దరామయ్య హయాంలో అయితే, కెంపెగౌడ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు వంటి భారీ పనులు చేశారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం కుమారస్వామి స్పందించారు. ‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మాటలను ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు. కాంగ్రెస్‌ పెద్దలే తమ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాలి. లేదా వారు ఇలాగే మాట్లాడతామంటే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. సీఎం కుర్చీపై నాకు మోజు లేదు’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ నుంచి అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ధర్మం పాటించడంలో కాంగ్రెస్‌ విఫలం అవుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావ్‌ స్పందిస్తూ..ఎమ్మెల్యే సోమశేఖర తన పరిధిని అతిక్రమించి మాట్లాడారు. తన వ్యాఖ్యలపై కుమారస్వామికి సోమశేఖర క్షమాపణలు చెప్పారని దినేశ్‌ పేర్కొన్నారు.  సిద్ధరామయ్య మాట్లాడుతూ కుమారస్వామితో చర్చించి విభేదాలను పరిష్కరించుకుంటామని తెలిపారు. సిద్దరామయ్య గొప్ప సీఎం అని, ఎమ్మెల్యేలు అలా అనడంలో తప్పు లేదని డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ వెనకేసుకొచ్చారు. సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేసినా వచ్చే నష్టంలేదని బీజేపీ నేత, మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌ అన్నారు. కుమారస్వామికి సిగ్గుంటే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత ఈశ్వరప్ప ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top