చంద్రబాబుకు జైలు భయం!

GVL Narasimha Rao Fires On Chandrababu Naidu In Amaravati - Sakshi

తనకూ చిదంబరం గతి పడుతుందనే బాబుకు వణుకు

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ వ్యాఖ్యలు

టీడీపీని మా పార్టీలో విలీనం చేస్తామంటే ఓకే

పొత్తు కోసం ఇప్పుడు ఆ పార్టీ దగ్గర ఏముంది?

తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా ఎదగాలన్నదే మా ఆకాంక్ష

సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం జైలుకు వెళ్లడం చూసి ప్రతిపక్ష చంద్రబాబుకు భయం పట్టుకొని ఉండొచ్చని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యానించారు. అవినీతిపరులను వదిలి పెట్టేది లేదని ఇటీవల ప్రధాని మోదీ హెచ్చరించగానే ఆ భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుతుండొచ్చని చెప్పారు. టీడీపీతో తమకు పొత్తన్నదే ఉండదని అయితే ఆ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామంటే మాత్రం జాతీయ నాయకత్వంతో మాట్లాడడానికి తాను సిద్ధమని ప్రకటించారు.

గతంలో పొత్తు పెటుకున్నప్పుడు టీడీపీ లాభపడింది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారే కానీ బీజేపీకి నామమాత్రం ప్రయోజనం కూడా కలగలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకి రావాలనే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని చెప్పారు. శనివారం విజయవాడలో ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో జీవీఎల్‌ మాట్లాడుతూ పొత్తు పెట్టుకోవడానికి ఇప్పుడు టీడీపీ దగ్గర ఏముందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు వరకు మోదీ, బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు పొత్తు గురించి మాట్లాడడం టీడీపీకి రాజకీయ భవిష్యత్‌ లేదని భయపడడం వల్లేనని చెప్పారు.

అసాధ్యాలను చేసి చూపించాం..
‘తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారం చేపట్టడమన్నది ఇప్పడు అసాధ్యంగా కనిపించే అంశమే. కానీ దేశ రాజకీయాల్లో అసాధ్యం అనుకున్నవి మోదీ నాయకత్వంలో అనేకం సాధించి చూపించాం. ఇక్కడా మా అంతట మేం అధికారంలోకి ఎలా రావాలన్న దానిపై దృష్టి పెట్టి కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లోనే గెలుస్తామన్న నమ్మకం ఉంది’ అని జీవీఎల్‌ చెప్పారు.ఇతర పార్టీల నుంచి ఎవరో వస్తేనే రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని తాము భావించడం లేదన్నారు.

బీజేపీ జాతీయ నాయకత్వంపై రాష్ట్ర ప్రజల్లో నమ్మకం కలిగించడం, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతుందని చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే అంశంపై బీజేపీ నాయకత్వంతో తాను మాట్లాడతానని ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని జీవీఎల్‌ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలి...
ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తాపత్రయం మంచిదే కానీ అందుకనుగుణంగా ఆదాయం పెంచుకోవడంపైనా దృష్టి పెడితే బాగుంటుందని జీవీఎల్‌ సూచించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమైతే అందులో కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశమే లేదన్నారు.

ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటుందన్నారు. అయితే రాజకీయ కారణాలతో రాజధాని మార్పు మంచిది కాదన్నారు. గత సర్కారు హయాంలో అవినీతి జరిగిందని నిపుణుల కమిటీలు తేల్చాక కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలేవీ తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు.

ఏ మొహంతో పొత్తు కోసం ప్రయత్నాలు?: కన్నా
తమతో పొత్తు కోసం టీడీపీ ఏ మొహం పెట్టుకొని వెంపర్లాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. రాజకీయ విలువలు లేని టీడీపీతో బీజేపీ ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయాలతో యూటర్న్‌లు తీసుకుంటూ విలువలను టీడీపీ దిగజార్చిందన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు టీడీపీకి శాశ్వతంగా ఎప్పుడో తలుపులు మూసి వేశారని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top