దిగివచ్చిన ప్రభుత్వం

ఎంపీ,ఎమ్మెల్యేల ధర్నా ఫలితం

కేసీ కాలువ నీటి విడుదలకు అంగీకారం

6న ఐఏబీ సమావేశానికి నిర్ణయం

నేటి నిరాహార దీక్ష వాయిదా

6 తర్వాత దీక్షలపై కార్యచరణ ప్రకటన

వైఎస్‌ఆర్‌ జిల్లా , ఖాజీపేట: దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడన్నట్లుగా కేసీ కెనాల్‌ రైతుల పరిస్థితి మారింది.ఒకవైపు కుందూనుంచి అధికంగా వరద నీరు వచ్చి పెన్నానదిలో కలుస్తోంది. మరోవైపు శ్రీశైలం జలాశయంలో 870 అడుగుల వరకు నీరు చేరింది. అయినా ప్రభుత్వంలోగానీ, అధికారుల్లోగానీ కేసీ  రైతులకు సాగునీరు ఇచ్చేందుకు ప్రకటన కూడా చేయడం లేదు. దీంతో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా ధర్నాతోపాటు నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు దిగివచ్చి సాగునీరు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..ప్రతి ఏటా జూన్‌లో పంటలు సాగు చేసుకోవాల్సిన కేసీ కెనాల్‌ రైతులు సరైన సమయంలో నీరు రాకపోకపోవడం వల్ల   దుక్కిదున్ని ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీరు చేరిన తర్వాత సాగునీరు వస్తుందని రైతులంతా భావించారు. కానీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

కడపజిల్లాలోనే  92 వేల ఎకరాల సాగునీటి కోసం కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా మైదుకూరు పట్టణంలోని కూడలిలో రైతులతో కలిసి సెప్టెంబర్‌ 23న మహా ధర్నాను చేశారు. 2వ తేదీలోగా అధికారులు స్పందించకపోతే 2,3తేదీల్లో రెండురోజులపాటు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. వైఎస్సార్‌ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు పెట్టిన రెండు ప్రధాన డిమాండ్లకు అధికారులు ఒప్పుకున్నారు. 6వ తేదీన ఇరిగేషన్‌ అడ్వయిజరీ బోర్డ( ఐఏబీ) సమావేశాన్ని నిర్వహించేందుకు అంగీకరించారు. అలాగే  కేసీ కాలువ కింద ఉన్న 92 వేల ఎకరాలతోపాటు తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ  ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఒప్పుకున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్ని ఎకరాలు సాగులో ఉన్నాయి? ఇంకా ఎంత భూమి సాగుకు సిద్ధంగా ఉంది?  ఏ మేరకు సాగునీరు కావాల్సి ఉంటుంది? అన్న విషయాలను అధికారులు  సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా నీటి విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కర్నూలులో ఈనెల 6వ తేదీన ఐఏబీ సమావేశం నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశానికి కడప, కర్నూలు జిల్లాల కేసీ కెనాల్‌ ఆయకట్టు పరిధిలోని ప్రజాప్రతినిధులు  హాజరు కావాలని అధికారులు తెలిపారు. దీంతో 2వ తేదీన మైదుకూరులోని నాలుగురోడ్ల కూడలిలో చేపట్టనున్న నిరాహార దీక్షను ఎంపీ, ఎమ్మెల్యేలు వాయిదా వేశారు.6వ తేదీన జరగబోయే సమావేశంలో పాల్గొని అక్కడ అధికారులు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి ఉద్యమ కార్యచరణ ప్రకటన చేసేందుకు వారు సిద్ధ మవుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top