కేసీఆర్‌ను నీరు అడగాలంటే చంద్రబాబుకు భయం

gopi reddy sreenivas reddy fired on chandra babu naidu - Sakshi

నీరు విడుదల చేయకపోతే ఎన్‌ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం

ఎన్‌ఎస్పీ ఎస్‌ఈ రమణారావుకు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు

నరసరావుపేట: కేసీఆర్‌ను నీరు అడగాలంటే చంద్రబాబుకు భయమని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌లలో సమృద్ధిగా నీరు చేరినందున ప్రభుత్వం కుడికాలువ ఆయకట్టు రైతులకు రబీపంటకు సాగునీరు విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఎన్‌ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కుడికాలువ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం వారిద్దరూ రైతులతో కలిసి ఎన్‌ఎస్పీ సూపరిండెంట్‌ ఇంజినీర్‌ వెంకటరమణారావుతో సమావేశమయ్యారు. రెండు ప్రాజెక్ట్‌లలో సోమవారం నాటికి 420 టీఎంసీలు ఉన్నా ప్రభుత్వం నీటి విడుదలపై ప్రకటన ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. గతంలో సాగర్‌లో 530 అడుగుల నీరుండగానే రైతులకు సాగునీరు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రి పత్తిపాటి పుల్లారావులు ఇక్కడ ఉండి కూడా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. గతేడాది వీరు రైతులకు నీరు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఇప్పుడు కనీసం నీరిచ్చేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడతామని కూడా ప్రకటన చేయట్లేదని మండిపడ్డారు.  ఇంకా 50 టీఎంసీల వరకు నీరు వచ్చే అవకాశం ఉన్నందున ఆయకట్టు రైతులకు నీరివ్వాలని కోరారు.

సాగర్‌డ్యాం తాళాలు తెలంగాణ చేతుల్లోనే..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ సాగర్‌ నుంచి నీరు తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సాగర్‌ డ్యామ్‌ తాళాలు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వద్దే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేవలం ఆరుతడి పంటలకే ఇద్దామని మంత్రివర్గంలో ముఖ్యమంత్రి అనటం బాధాకరమైన విషయమన్నారు. దీనిని బట్టి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అర్ధమవుతుందని స్పష్టం చేశారు. గత మూడేళ్ల నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు సాగునీరు అందక అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.  దాళ్వాకు నీరివ్వాలని కోరుతూ ఎస్‌ఇ రమణారావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వానికి నివేదిస్తామని ఎస్‌ఈ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నరసరావుపేట, రొంపిచర్ల మండల అధ్యక్షుడు పచ్చవ రవీంద్ర, కొమ్మనబోయిన శంకరయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి పి.ఓబుల్‌రెడ్డి, సర్పంచులు కంచేటి వీరనారాయణ, చల్లా నారపరెడ్డి, ఎంపీటీసీ ధూపాటి వెంకటేశ్వర్లు, సాంబశివరావు, రైతులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top