గెలిపిస్తే.. మీ జీతగాళ్లలా పనిచేస్తాం

Give A Chance To Ramesh In Next Elections - Sakshi

రమేష్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి

తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు

బషీరాబాద్‌లో కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం

చెంగోల్‌ ఎంపీటీసీని కిడ్నాప్‌ చేశారని కాంగ్రెస్‌ నాయకుల ఆరోపణ  

బషీరాబాద్‌(తాండూరు) : ‘మా కాందాని నుంచి ఇద్దరు మీ ఆశీర్వాదంతో మంత్రులయ్యారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మా కుటుంబ గొడవల కారణంగా పోయిన ఎన్నికల్లో రెండుసార్లు ఓడిపోయాం. ఇప్పుడు మాకు బుద్దొచ్చింది.. మీరంతా ఒక్క అవకాశం ఇవ్వండి. రమేష్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ జీతగాళ్లలా పనిచేస్తాం..’’ అంటూ  తాండూరు మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరావు ఆసక్తికర వాఖ్యలు చేశారు.

బషీరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. శక్తియాప్‌ ద్వారా గ్రామాల్లో ఓటర్లకు సభ్యత్వం చేయించాలని సూచించారు. రాజకీయాలు గతంలో మాదిరిగా లేవని, అబద్దాలు చెప్పేవారిని, మోసం చేసేవారినే నమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహరాజుల కుటుంబానికి మోసం చేయడం, బెదిరించడం తెలియవన్నారు.

మా ఇద్దరు అన్నలు మాణిక్‌రావు, చంద్రశేఖర్‌లను గెలిపించి మంత్రులుగా ఎదగడంలో మీ పాత్ర మరువలేనిదని తెలిపారు. ఈ సారి అన్న కొడుకు రమేష్‌ను గెలిపించి రాజకీయాలకు ఉండాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. శక్తియాప్‌ ద్వారా ప్రతీ గ్రామంలో 60 శాతానికి పైగా సభ్యత్వం చేయించాలని కార్యకర్తలకు సూచించారు. వారం రోజుల్లో మళ్లీ గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు. 

డబ్బు రాజకీయాలు ఎక్కువకాలం సాగవ్‌

అన్నిసార్లు డబ్బుతోనే రాజకీయాలను నడిపిస్తామంటే మూర్ఖత్వమే అవుతుందని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రమేష్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు చెంగోల్‌లో కాంగ్రెస్‌ ఎంపీటీసీని కిడ్నాప్‌ చేశారని, రెండు రోజుల్లో తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. తాండూరు ఎంపీపీపై సొంత పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసం పెడితే.. తమ పార్టీ ఎంపీటీసీని కిగ్నాప్‌ చేసి దాచిపెట్టారని మండిపడ్డారు.

ఇవన్నీ జిల్లా మంత్రి సూచనల మేరకే జరుగుతున్నాయని ఆరోపించారు. రేపటిలోగా ఎంపీటీసీని అప్పగించకపోతే టీఆర్‌ఎస్‌ నాయకులపై కిడ్నాప్‌ కేసు పెడుతామని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో తాండూరులో టీఆర్‌ఎస్‌ పార్టీ రూ.30 కోట్లు ఖర్చు పెట్టినా.. గెలిచేది మాత్రం కాంగ్రెస్‌ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్‌ మాజీ  చైర్మన్‌ విశ్వనాథ్‌గౌడ్, మాజీ కౌన్సిలర్‌ హరిగౌడ్, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రాజరత్నం, శివప్రసాద్, నరేష్‌ చౌహన్, ఉల్గప్ప, మంతట్టి సురేష్, రాములు, వీరారెడ్డి, జీవన్గీ నర్సిములు, మస్తాన్, మునీర్, రాజన్‌గౌడ్, కాశప్ప, సాయిలుగౌడ్, పవన్, జగన్నాథ్, ధన్‌సింగ్, రాజన్‌గౌడ్, పెంటప్ప, మాధవరెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, మోహన్, లక్ష్మన్, వడ్డే శీను, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top