ఇంత అకస్మాత్తుగా రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేస్తారు?

Gehlot questions morality of revoking President's rule Maha govt formation    - Sakshi

జైపూర్: మహారాష్ట్ర రాజకీయంలో రాత్రికి రాత్రికే చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఆశ్చర్యంలో ముంచెత్తాయి. మహా సీఎం పీఠం బీజేపీకి చేజారిపోయినట్టేనని భావిస్తున్న తరుణంలో శనివారం తెల్లవారేసరికి పరిస్థితి మొత్తం బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఈ మహా ట్విస్ట్‌ షాక్‌ నుంచే తేరుకునేలోపే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణం చేశారు. అటు ఎన్‌సీపీ కీలక నేత, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ సమీప బంధువు అజిత్‌ పవార్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈ హఠాత్పరిణామాలపై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ స్పందించారు. ఇంత అకస్మాత్తుగా రాష్ట్రపతి పాలనను ఉపసంహరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీజేపీ-ఎన్‌సీపీ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వైనాన్ని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఏ దిశకు తీసుకువెళుతున్నారంటూ ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. సరియైన సమయంలో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెపుతారని ట్వీట్‌ చేశారు. 

సీఎం ఫడ్నవిస్‌, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ అపరాధ భావనతో ఉన్నారని, తాము మంచి పాలనను అందించగలమనే విశ్వాసమే వారికి లేదని ఆరోపించారు.  అంతేకాదు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా విజయవంతమై సుపరిపాలన ఇస్తారా అనే సందేహం తనకు ఉందని, అంతిమంగా మహారాష్ట్ర ప్రజలు నష్టపోనున్నారని గెహ్లాట్ పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో ఈ నెల 12న అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ  శనివారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ  చేశారు.  మరోవైపు  ఫడ్నవిస్‌ ప్రభుత్వ బల నిరూపణకు నవంబర్ 30వ తేదీ గడువు విధించారు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ. 

బిగ్‌ ట్విస్ట్‌: సీఎంగా ఫడ్నవిస్‌ ప్రమాణం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top