ఇక ‘ఉత్త’ర గంట

Ganta Srinivasa Rao Corruption Story - Sakshi

అనకాపల్లి.. చోడవరం.. భీమిలి.. ఇప్పుడు విశాఖ ఉత్తరం..పిల్లి పిల్లలను మార్చిన చందంగా ప్రతి ఎన్నికలకు నియోజకవర్గం మారుస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారికి విశాఖ ఉత్తర నియోజకవర్గం మీద పడ్డారు. ఏ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు పోటీ చేయకుండా.. ఎక్కడా స్థిరం లేకుండా, ఒకే రాజకీయ పార్టీలోనూ లేకుండా ఎన్నికలకో సెగ్మెంట్‌ మారుస్తున్న గంటా శ్రీనివాసరావు అడ్డగోలు సంపాదన, స్థిర, చరాస్తులను కూడబెట్టడంలో మాత్రం ఏకరీతినే దూసుకుపోయారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ఏమాత్రం పట్టించుకోని, లెక్క చేయని గంటా నిర్వాకానికి ఆయన ‘ఇళ్లే’ ఓ ఉదాహరణ. గంటా విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉంటున్న బహుళ అంతస్తుల భవంతిని ఇండియన్‌ బ్యాంకు ఇప్పటికే వేలం ప్రకటన వేస్తే.. ఆయన భీమిలిలో సముద్రతీరంలో కట్టుకున్న ఇల్లు ఓ వివాదాస్పద నిర్మాణం. సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా బీచ్‌ ఒడ్డున సొంతిల్లు  కట్టుకున్నారన్న అపవాదు ఎదుర్కొన్నారు. ఇలా.. ఇళ్లతోనే మొదలైన ఆయన దోపిడీ పర్వానికి మొత్తం లెక్క కడితే కోట్లాది రూపాయలు ఉంటుందని టీడీపీ నేతలే అంచనా వేస్తున్నారు. ఐదేళ్లుగా గంటా గ్యాంగ్‌ భీమిలిలో సాగించిన భూదందాలతో మళ్లీ అక్కడ ముఖం చూపించలేని పరిస్థితి తెచ్చుకున్నారు.

ఈలోగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి భీమిలి సమన్వయకర్త కాగానే గంటా అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. సీఎం కుమారుడు లోకేష్‌ పేరు బూచిగా చూపించి ముందు భీమిలి నుంచి బయటపడ్డారు. ఇదే సమయంలో గంటాను విశాఖ ఎంపీగా పోటీ చేయించాలని బాబు తలపోస్తే.. బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌ను తెరపైకి తెచ్చి ఆ పోటీ నుంచి కూడా తప్పుకున్నారు. భీమిలికి లోకేష్‌ రాలేదు.. ఇటు లోక్‌సభ సీటు ఇప్పటికీ భరత్‌కు ఖరారు చేయలేదు. కానీ గంటా మాత్రం వ్యూహాత్మకంగా గత ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన విశాఖ ఉత్తర సీటును దక్కించుకున్నారు. ఎలాగోలా భీమిలి నుంచి బయటపడి టికెట్‌ అయితే తెచ్చుకున్నారు గానీ.. అప్పుడే ఉత్తర నియోజకవర్గ ప్రజలు గంటా భారం మాకొద్దు బాబోయ్‌ అంటున్నారు. ఎక్కడ ఎమ్మెల్యేగా చేసినా.. అక్కడ దోపిడీకి పాల్పడే గంటాను ఈ సారి ‘ఉత్త’చేతులతోనే పంపించేస్తామని ఉత్తర నియోజకవర్గ ప్రజలు ఘంటా బజాయించి మరీ చెబుతున్నారు.  

ప్రకాశం జిల్లా నుంచి బతకుదెరువు కోసం విశాఖ వలస వచ్చి ఓ దినపత్రికలో యాడ్‌ ఎగ్జిక్యూటివ్‌గా జీవితంలో ఆదాయ ప్రస్థానం మొదలుపెట్టిన గంటా ఆ తర్వాత షిప్పింగ్‌ రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగారు. 1999లో అనూహ్య రీతిలో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా, ఆ తర్వాత 2004లో చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, 2009లో ప్రజారాజ్యం తరఫున అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా, 2014లో భీమిలి నుంచి తిరిగి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాస్తవానికి 1999లో ప్రజాప్రతినిధిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన గంటాపై మొదట్లో పెద్దగా అవినీతి, అక్రమార్జన ఆరోపణలేమీ లేవు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమైన పరిణామాల నేపథ్యంలో 2011లో తొలిసారి మంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్రమక్రమంగా ఆరోపణలు వెల్లువెత్తుతూ వచ్చాయి. ఇక 2014లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడం.. గంటాకు మళ్లీ మంత్రి పదవి రావడం దరిమిలా.. మొదలైన అవినీతి, అక్రమార్జన పర్వం, దోపిడీ స్థాయి పరాకాష్టకు చేరిపోయింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top