మోసాలకు అంబాసిడర్‌గా కేసీఆర్‌

Gaddar, Mallu Bhatti Vikramarka, Vijayashanti during a roadshow - Sakshi

టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు: విజయశాంతి

మధిర/ఏటూరునాగారం: గత ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి అన్నారు. శనివారం ఆమె ఖమ్మం జిల్లా మధిర మం డలం సిరిపురంలో, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. దొర ఒక వైపు, కాంగ్రెస్‌ మరోవైపు అని.. దొర కావాలో, ప్రజా సమస్యలు పరిష్కరించే కాంగ్రెస్‌ పార్టీ కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యమాలతో దోచుకోవడం, దాచుకోవడం చేశారన్నారు.

ఈ విషయంలో కేసీఆర్‌ మోసాలకు అంబాసిడర్‌గా మారారని ఆరోపించారు. నాడు మహాత్మాగాంధీ సింపుల్‌గా ఉండేవారని, కేసీఆర్‌ మాత్రం పబ్లిసిటీ పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గాంధీ నాడు తన కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వలేదని, కేసీఆర్‌ నలుగురు కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చారని విమర్శించారు. డిసెంబర్‌ 11 తర్వాత రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్‌ మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక మోసాలతో వ్యవస్థకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఖమ్మం జిల్లా చారిత్రాత్మకమైందని, ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పాటలతో ఆయన అలరించారు.

కీలక స్థానంలో ఉంటా: భట్టి
త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని, అందులో తాను కీలక స్థానంలో ఉంటానని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మధిర కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 70 నుంచి 80 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము ఇస్తున్న హామీలు సంక్షేమ పథకాల ను వెంటనే అమలు చేస్తామన్నారు. నిధులను నలుగురి కోసం కాకుండా 4 కోట్ల మంది ప్రజలకు పంచుతామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం ఆసన్నమైం దన్నారు. దొరల పాలన కావాలో, ప్రజాపాలన కావా లో తేల్చుకోవాల్సింది ప్రజలేనన్నారు. మధిర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు.  

కేసీఆర్‌ అబద్ధాలను ప్రజలు నమ్మరు: రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు: లేచింది మొద లు కొని పడుకునే వరకు అబద్ధాలు ఆడే సీఎం కేసీఆర్‌ ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివెల, కిష్టాపురం గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం లాంటి అమలుకు వీలుకాని హామీలిచ్చి గద్దెనెక్కాడన్నారు. అయితే ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ఈ ఎన్నికల్లో అబద్ధాలు ఆడే అవకాశం లేకుండా పోయిందన్నారు. 7న జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని కేసీఆర్‌ గ్రహించారని, అందుకే తాను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పుకొస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top