బీజేపీలోకి జితేందర్‌రెడ్డి?

Former TRS MP Jithender Reddy to join BJP  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో మోదీ పాల్గొనే బహిరంగసభలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. గత కొద్ది నెలలుగా జితేందర్‌రెడ్డి పార్టీ మారుతారన్న చర్చ జరుగుతోంది. గతంలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయనకు జాతీయ నేతలతో సంబంధాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రులు ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనికి జితేందర్‌రెడ్డి కారణమన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ నేతలతో సంబంధాలు ఉండటంతో పాటు మంత్రుల ఓటమికి జితేందర్‌రెడ్డి కారణమన్న ఉద్దేశంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వలేదని టీఆర్‌ఎస్‌ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయనకు టికెట్‌ రాకపోవడంతో బీజేపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు కోరారు. ఈ సమయంలోనే డీకే అరుణ బీజేపీలో చేరడం, ఆమెకు మహబూబ్‌నగర్‌ టికెట్‌ ప్రకటించారు. అయితే బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపి రాజకీయ భవిష్యత్‌పై భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా విముఖత వ్యక్తం చేసినా.. తర్వాత పార్టీలో చేరడానికి అంగీకరించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులో మహబూబ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అదే రోజు జితేందర్‌రెడ్డి బీజేపీలో చేరుతారని సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top