నాన్న నాన్నే...నేను నేనే...

Father and Daughter To Fight As Rivals In AP Elections 2019 - Sakshi

రాజ వంశాలు... వారి వైభవం, వైరం, చరిత్ర గురించి చెప్పుకోకుంటే ఉత్తరాంధ్ర రాజకీయాలు అసంపూర్తే. రాజుల కాలం నాటి విభేదాలు ఇప్పటికీ వారి మధ్య కొనసాగుతున్నాయి. అయితే, ఈసారి ఏకంగా కురుపాం రాజ కుటుంబంలోని తండ్రీ– కూతురు తలపపడుతుండటం ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చింది. 

సాక్షి, అమరావతి : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని కురుపాం రాజ వంశానికిచెందిన వైరిచర్ల కుటుంబం మరోసారి నిరూపిస్తోంది. ఈ కుటుంబానికి చెందిన తండ్రీ, తనయలు అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీ పడనున్నారు. ఎందుకంటే అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కిశోర్‌చంద్రదేవ్‌ పోటీ చేయనున్నారు. నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌(ఎస్‌)లోనూ అనంతరం కాంగ్రెస్‌(ఐ)లో ఆయన ఢిల్లీస్థాయిలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన టీడీపీలో చేరారు. అయితే బద్ధవ్యతిరేక టీడీపీలో  చేరడం ఆయన కుమార్తె శృతీదేవికి ఏమాత్రం నచ్చలేదు. తాను కాంగ్రెస్‌లోనే  కొనసాగుతానని ఆమెచెప్పారు. అంతేకాదు కాంగ్రెస్‌ అరకు ఎంపీ టికెట్‌ కోసం దరఖాస్తు కూడా చేశారు. తండ్రి కోసం శృతీదేవి వెనక్కి తగ్గుతారని భావించినప్పటికీ ఆమె మాత్రం తన నిర్ణయానికే కట్టుబడ్డారు. కాగా చంద్రబాబు ప్రకటించిన టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో కిశోర్‌చంద్రదేవ్‌కు స్థానం కల్పించారు. అదేవిధంగా కాంగ్రెస్‌ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో శృతీదేవికి అరకు ఎంపీ టికెటును కేటాయించారు. అంటే తండ్రి టీడీపీ అభ్యర్థిగా... తనయ కాంగ్రెస్‌ అభ్యర్థిగా టికెట్లు దక్కించుకున్నారు. కురుపాం రాజకుటుంబంలోని రాజకీయ వైచిత్రి సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాధారణ గిరిజన కుటుంబానికి చెందిన గొడ్డేటి మాధవిని తమ అభ్యర్థిగా ప్రకటించడంపట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top