ఫరూఖ్‌ అబ్దుల్లా రాజకీయ నిరుద్యోగి

Ex Minister Dr Khaleel Bhasha Commented On Kashmir Former CM Farooq Abdullah - Sakshi

 ధ్వజమెత్తిన మాజీ మంత్రి ఖలీల్‌బాషా, హఫీజుల్లా 

సాక్షి, కడప కార్పొరేషన్‌: కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా రాజకీయ నిరుద్యోగి అని  అక్కడి ప్రజలు ఆయన్ను తిరస్కరించి పక్కనబెట్టారని మాజీ మంత్రి డా. ఖలీల్‌బాషా ఎద్దేవా చేశారు. బుధవారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కాల్‌టెక్స్‌ ఇనాయతుల్లా, హఫీజుల్లా, డా. సుహైల్‌ అహ్మద్‌లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లాను తెచ్చి కడపలో రోడ్‌ షో చేస్తే 500 మంది కూడా జనం లేక అట్టర్‌ ప్లాప్‌ అయ్యిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం గూర్చి ఏమీ తెలియని ఫరూఖ్‌ అబ్దుల్లా హిందూ, ముస్లింలకు కొట్లాట పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ అన్ని మతాల వారు అన్యోన్యంగా ఉన్నారని, చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసమే వైఎస్‌ జగన్‌ రూ.1500 కోట్లు ఆఫర్‌ చేశారని అబద్ధాలు ఆడుతున్నారని  ధ్వజమెత్తారు.

గోద్రా అల్లర్ల గూర్చి ఇప్పుడు ప్రస్తావిస్తున్న చంద్రబాబు నాలుగున్నరేళ్లు ఎవరి ఒడిలో కూర్చున్నాడో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి సీఎంగా ఉండటం దరిద్రమన్నారు. నారా హమారా, టీడీపీ హమారా సభలో ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసులు పెట్టిన చంద్రబాబుకు ముస్లిం ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.   మైనార్టీలు నాకు ఓట్లు వేయలేదు కదా అనే భావనతో నాలుగున్నరేళ్లు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా పక్కనబెట్టారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మైనార్టీ మంత్రి లేని కేబినెట్‌ ఇదేనన్నారు. ప్రత్యేక హోదాను కావాలనే పక్కనబెట్టి ప్యాకేజీ కోసం కేంద్రానికి లేఖ రాశారని, ఆ లేఖను కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ బయటపెట్టారన్నారు.

ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మళ్లీ మభ్యపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారన్నారు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఏ ఒక్కరికీ రుణాలు అందలేదన్నారు. దూదేకుల కులస్తులు కూడా బాబు మాటలు నమ్మి మోసపోయారన్నారు. సచార్‌ కమిటీ, రంగనాథ్‌ మిశ్రా కమిటీల సూచనలు ఏమాత్రం అమలు కాలేదన్నారు. 2004లో ఏడాది ముందు ఎన్నికలకు పోయిన చంద్రబాబు 105 సీట్లను మార్చారని, ఫలితాల్లో మార్చిన సీట్లలో ఐదు మాత్రమే గెలుపొందారన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉందని,  ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇంటికే పరిమితం కాక తప్పదని జోష్యం చెప్పారు. 

బాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్న ఫరూఖ్‌ అబ్దుల్లా 
సీఎం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే ఫరూఖ్‌ అబ్దుల్లా చదువుతున్నారని, ఆయనకు మన రాష్ట్రం గూర్చి ఎలాంటి అవగాహన లేదని వైఎస్‌ఆర్‌సీపీ నేత కాల్‌టెక్స్‌ హఫీజుల్లా అన్నారు. 1996లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఫరూఖ్‌ అబ్దుల్లా చెబితే  నమ్మేవాళ్లు ఎవరూ లేరన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని, అధికారంలోకి వచ్చాక వదిలేస్తాడన్నారు. ఆయన పార్టీల గూర్చే ఆలోచిస్తాడు తప్పా ప్రజల గురించి ఆలోచించడన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తారని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలో కూడా మైనార్టీ మంత్రి ఉన్నారని, నాలుగున్నరేళ్లు మన రాష్ట్రంలో మైనార్టీ మంత్రి లేరని తెలిపారు. సమావేశంలో మైనార్టీ నాయకులు అక్బర్‌ అలీ పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top