అప్పుడు అడ్డుపడి.. ఇప్పుడు విమర్శలా? 

Etela Rajender Fires On opposition Parties About Osmania Hospital Issue - Sakshi

'ఉస్మానియా’ కొత్త బిల్డింగ్‌ కోసం 2015లోనే సీఎం ప్రతిపాదన

అప్పుడు అడ్డుకున్నది విపక్షనేతలే: మంత్రి ఈటల

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలో ప్రతిపక్షాల నేతల చేష్టలతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య  మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ముందుచూపుతో ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిద్దామని 2015లోనే ప్రతిపాదించారని, కానీ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతోనే నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఫలితం గా వారే ఇప్పుడు అక్కడి రోగుల ఇబ్బందులకు కారకులయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆస్పత్రిలోకి వర్షం నీళ్లు వస్తున్నాయంటూ అర్థం లేకుండా మాట్లా డటం సరికాదన్నారు. నూతన భవన నిర్మాణ ప్రతిపా దనను పక్కనపెట్టి పెద్ద ఎత్తున మరమ్మతులు చేయించిందని చెప్పారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లో వర్షాల కారణంగా కొన్ని పెచ్చులు ఊడటం, వరద నీరు లోపలికి రావడం వల్ల పేషెంట్లకు, సిబ్బందికి కొంత ఇబ్బంది కలిగిందన్నారు.  

మూసీకి వెళ్లే నాలా బ్లాక్‌ కావడంతో.. 
డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి, టీఎస్‌ఎంఐడీసీ సీఈ లక్ష్మారెడ్డి ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి మంత్రి ఈటలకు నివేదిక అందజేశారు. బేగంబజార్‌ నుంచి మూసీకి ఉస్మానియా ఆస్పత్రి భూ గర్భం నుంచి వరద నీటి నాలా వెళ్తోందని, అది బ్లాక్‌ కావడంతోనే ఆస్పత్రిలోకి నీళ్లు వచ్చాయని అధికారులు వివరించారు. జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బందితో కలసి నీటిని తీసేశామని తెలిపారు.  ఖులీ ఖుతుబ్‌ షా బిల్డింగ్‌లో 200 పడకలను సిద్ధం చేశామని, ఇక్కడున్న పేషెంట్లను అక్కడికి తరలించామని వెల్లడించారు. కోవిడ్‌–19 తొలికేసు నమోదయిన మార్చి 2 నుంచి ఇప్పటివరకు 108 రోజులు గడిచినా ఏ ఒక్కరోజు కూడా వైద్య, ఆరోగ్య శాఖ విరామం తీసుకోలేదని రాజేందర్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వితో సమావేశమై భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై  దిశానిర్దేశం చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top