ఆ సీటు... హాట్‌ కేకు.. రూ.100 కోట్లతో కొన్న వైనం | Sakshi
Sakshi News home page

ఆ సీటు... హాట్‌ కేకు.. రూ.100 కోట్లతో కొన్న వైనం

Published Mon, Mar 25 2019 10:02 AM

An Estimated Rs 100 Crore Has Been Transferred to The Ruling Party For a Assembly Seat in Kurnool District - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లాలో కీలకమైన ఓ అసెంబ్లీ సీటు హాట్‌కేకుగా మారింది. ఏకంగా ఒక సీటు కోసం రూ.100 కోట్ల మేరకు అధికార పార్టీలో చేతులు మారినట్టు తెలుస్తోంది. మొదట్లో ఈ సీటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు ఓ ప్రజా ప్రతినిధి తనయుడికి కేటాయించారు. ఈ పరిణామం వెనుక భారీ తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. అధికార పార్టీలోని అగ్రనేతలతో పాటు జిల్లాలోని ఇద్దరు బలమైన నేతలకు భారీగా సొమ్ములు ముట్టినట్టు సమాచారం.

ప్రధానంగా అధికార పార్టీలోని అగ్రనేత ఒకరికి చెన్నైలోని విలువైన స్థలాన్ని అందజేసినట్టు తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలోని ఇద్దరు నేతలకు కూడా చెరో రూ.20 కోట్ల చొప్పున ముట్టజెప్పినట్టు చర్చ జరుగుతోంది. ఫలితంగానే మొదటి నుంచి ఒకరికి సీటు వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు మరో వ్యక్తికి ఇచ్చినట్టు సమాచారం. చెన్నైలో స్థలం పొందిన నేత కాస్తా వీరికే సీటు ఇచ్చే విధంగా అధినేత వద్ద పావులు కదిపారు.

ఇక జిల్లాలోని ఇద్దరు ముఖ్య నేతల్లో ఒకరు రూ.20 కోట్ల ప్యాకేజీతో ఏకంగా వారితోనే కలిసి తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు. మరో నేత కూడా రూ.20 కోట్ల ప్యాకేజీ తీసుకుని సీటు రావడానికి సహకరించినట్టు తెలుస్తోంది. జిల్లాలోని మరో నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా ముగ్గురు నేతలకు మూటలు అందిన తర్వాతే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. మొత్తమ్మీద అధికార పార్టీలో సీట్ల కేటాయింపులో ప్యాకేజీనే ప్రధానపాత్ర పోషించిందని జిల్లావాసులు అనుకుంటున్నారు. 

Advertisement
 
Advertisement