
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి. చిత్రంలో ఎమ్మెల్యే రాజయ్య
సాక్షి ప్రతినిధి, వరంగల్/భూపాలపల్లి: ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహించే నాయకుడే ఈసారి దేశ ప్రధాని అవుతారని, ఆ యోగం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ప్రాంతీయ పార్టీలు సూచించిన నాయకుడే ప్రధాని అవుతారని ఆయన పేర్కొన్నారు. వరంగల్‌లో ఏప్రిల్ 2న జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతోనూ. అలాగే.. భూపాలపల్లిలో కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఈ లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ బిడ్డలకు ప్రతిష్టాత్మకమైనవని, తెలంగాణలో 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఢిల్లీని శాసించేది మన తెలంగాణ బిడ్డ కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆజంజాహి మిల్లు ఆవరణలో నిర్వహించే సభలు తెలంగాణ బిడ్డలకు కలిసొస్తాయని, గతంలో ఇక్కడి సభలో పాల్గొన్న పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. ఈసారి కూడా ఈ సెంటిమెంట్ కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
2 లక్షల మంది జనసమీకరణ
బహిరంగ సభకు రెండు లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, చరిత్ర సృష్టించే విధంగా కేసీఆర్ సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. దేశంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని, కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోందని చెప్పారు. విపక్షాలకు ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. వరంగల్ అంటే కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమని, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏపీలోనూ టీడీపీ దుకాణం బంద్
తెలంగాణలో ఇప్పటికే టీడీపీ దుకాణం బంద్ అయిందని, త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ పార్టీ పని అయిపోతుందని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసేందుకు ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని అన్నారు.