ఫస్ట్‌ ఖమ్మం... లాస్ట్‌ ఇందూరు

ECI all set for May 23 counting across State - Sakshi

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడిపై అంచనా

వీవీప్యాట్‌ల లెక్కింపు, కౌంటింగ్‌ ప్రక్రియలో వేగమే కీలకం

ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు 15–30 రౌండ్లలో ఫలితం వెల్లడయ్యే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: మరో 48 గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. లోక్‌సభ ఎన్నికల్లో విజేతలెవరో తేలనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతోపాటు ఏ నియోజకవర్గం ఫలితం ఎప్పుడు వస్తుంది... ముందుగా ఫలితం ఎక్కడ తేలుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎన్నికల సంఘం కౌంటింగ్‌ కోసం చేసిన ఏర్పాట్ల ప్రకారం చూస్తే ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపులో తొలుత ఖమ్మం ఫలితం రానుందని అంచనా. చివరగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నిజామాబాద్‌ ఫలితం వెలువడనుంది. అయితే ప్రతి నియోజకవర్గానికి సగటున ఐదు పోలింగ్‌ కేంద్రాల్లోని వీవీప్యాట్లను లెక్కించాలన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆయా పార్లమెంటు సెగ్మెంట్లలో ర్యాండమ్‌గా తీసుకొనే పోలింగ్‌ స్టేషన్లలో ఉన్న ఓట్లనుబట్టి ఫలితాల వెల్లడి స్థానాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘కౌంటింగ్‌’తీరూ కీలకమే...
తెలంగాణలోని 35 కౌంటింగ్‌ కేంద్రాల్లో 17 లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేసిన ఈసీ.. ఒక రౌండ్‌కు 14 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను లెక్కించనుంది. ఈ లెక్కన రాష్ట్రంలో తక్కువ 1,476 పోలింగ్‌ స్టేషన్లున్న ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌ ఫలితం మొదట రానుంది. అయితే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఐదు వీవీప్యాట్లను లెక్కించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసినందున వాటి లెక్కింపునకు అదనంగా మరో ఐదు గంటలు పట్టనుంది. తొలుత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించిన అనంతరం చివరగా ర్యాండమ్‌ పద్ధతిలో ఐదు వీవీప్యాట్లలోని ఓట్ల ను లెక్కించనున్నారు. ఈవీఎంలలో పోలైన ఓట్ల తో వాటిని సరిపోల్చుకున్న అనంతరం విజేతను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఒక్కో రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు సగటున 20 నుంచి 30 నిమిషాలు పట్టనుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉన్న చోట ఈ సమ యం మరింత పట్టే అవకాశం లేకపోలేదని ఈసీ వర్గాలంటున్నాయి. ఆయా కౌంటింగ్‌ కేంద్రాల్లోని పరిస్థితులు, ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్‌ అధికారి పనితీరు ఫలితాల వెల్లడికి పట్టే సమయంపై ప్రభా వం చూపే వీలుందని చెబుతున్నాయి. పోలింగ్‌ బూత్‌లు ఎక్కువగా ఉన్న పార్లమెంటు సెగ్మెంట్‌ ఫలితాలు కూడా ముందుగానే వెలువడే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నాయి. ఈవీఎం ఓట్ల కౌంటింగ్‌ సమయంలో ప్రతి అభ్యర్థికి పోలైన ఓట్లను రికార్డు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల ఆలస్యం జరిగే అవకాశముంది. ఈ క్రమంలో పోలింగ్‌ కేంద్రాలు తక్కువగా ఉన్న జహీరాబాద్, మెదక్, ఆదిలాబాద్‌ ఫలితాలు ముందుగా వెలువడినా ఆశ్చర్యంలేదు.

నిజామాబాద్‌లో ఆలస్యం...
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితం ఆలస్యం కానుంది. దేశంలోనే ఆలస్యంగా ఫలితం వెలువడే లోక్‌సభ స్థానం ఇదే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సీటుకు 185 మంది పోటీపడుతుండటంతో ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగనుంది. ఓటింగ్‌ యంత్రాల్లో నిక్షిప్తమైన ఒక్కో అభ్యర్థికి నమోదైన ఓట్లను పరిశీలించి రికార్డు చేసేందుకు సగటున ఏడు నిమిషాలు తీసుకోనుంది. దీంతోపాటు చివరగా లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని 35 పోలింగ్‌ కేంద్రాల్లోని వీవీప్యాట్లను లెక్కించాల్సి ఉండటంతో ఫలితం ఆలస్యం కానుంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపుతో పోలిస్తే దీనికే ఎక్కువ సమయం పట్టనుంది. అయితే అభ్యర్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. ఈ కౌంటింగ్‌ కేంద్రంలో 18 టేబుళ్లను ఏర్పాటు చేసింది.

తద్వారా ఫలితాల వెల్లడిలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలోని ఎల్బీ నగర్, మేడ్చల్‌ అసెంబ్లీ స్థానాల పరిధిలోని 500 పైచిలుకు పోలింగ్‌ కేంద్రాలు ఉండటంతో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సగటున ఇక్కడ 30 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే మేడ్చల్, ఎల్బీ నగర్‌ అసెంబ్లీల పరిధిలో 28 టేబుళ్లు ఏర్పాటు చేయడంతో పార్లమెంటు కౌంటింగ్‌ రౌండ్లు తగ్గుతాయనే అంచనా ఉంది. అయితే అవి ఏ మేరకు తగ్గుతాయన్న దానిపై స్పష్టత లేదు. మొత్తంమీద అత్యధిక ఓటర్లు, పోలింగ్‌ స్టేషన్లు ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top