బాలయ్య హామీ.. ఎండమావి!

Drinking Warter Problems Faced In Balakrishna Constitution - Sakshi

పురం ప్రజల గొంతులో నీటి ముల్లు

ఏప్రిల్‌లో నీళ్లిస్తామని ఎమ్మెల్యే ప్రగల్భాలు

నత్తనడకన గొల్లపల్లి పైపులైన్‌ పనులు

పునాది దశలోనే పంపింగ్‌ స్టేషన్‌

పెనుకొండ హైవేలో రోడ్డు పక్కనే పైపులు

అరకొరగానే కేంద్ర నిధులు

హిందూపురం అర్బన్‌: పట్టణ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు రూ.194కోట్ల కేంద్ర నిధులతో గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ నిర్మాణానికి గత ఏడాది డిసెంబర్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఆ సందర్భంగా కొట్నూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వెనువెంటనే టీడీపీ నాయకులు బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తారు. గొల్లపల్లి నుంచి నీటిని తీసుకొస్తున్న అపర భగీరథుడనే ప్రచారం చేశారు. ఇదంతా మాటలకే పరిమితం అనే విషయం ప్రజలు తెలుసుకునేందుకు ఎంతో కాలం పట్టలేదు. రోడ్డు పక్కన ఎక్కడపడితే అక్క ఉండిపోయిన పైపులను చూస్తే ఈ ఏడాది పనులు పూర్తయ్యే పరిస్థితి లేదని అర్థమైపోయింది. పెనుకొండ హైవే పక్కన దాదాపు 60 కిలోమీటర్ల పొడవున చేపట్టాల్సిన పైపులైన్‌ పనులు ఇప్పటికీ 20 కిలోమీటర్లు దాటని పరిస్థితి. రాచేపల్లి, చకర్లపల్లి, సోమిందపల్లి వద్ద పనులు కొనసాగుతున్నాయి.

పునాదులు కూడా పూర్తికాని ఫిల్టర్‌బెడ్, పంపింగ్‌ స్టేషన్‌ పనులు
ప్రాజెక్టుకు అతి ముఖ్యమైన నీటి ఫిల్టర్, పంపింగ్‌ స్టేషన్‌ పనులు ప్రారంభ దశలోనే ఉండిపోయాయి. కొట్నూరు వద్ద 3.5 ఎకరాల్లో ఈ ఫిల్టర్‌ పాయింట్‌ పనులు చేస్తున్నారు. పంపింగ్‌స్టేషన్, ఫిల్టర్‌పాయింట్స్‌ ప్రసుత్తం డిజైన్‌ దశలోనే ఉన్నాయి. కేవలం ఫిల్టర్‌ బెడ్‌ నిర్మాణానికి ఇనుప కడ్డీలు ఏర్పాటు చేయగా.. వాటర్‌ వెల్, పక్కనే పిల్లర్‌ పాయింట్, నీటి అవుట్‌ పైప్‌లైన్‌ నిర్మాణాలు ఇప్పటికీ ప్రారంభం కాని పరిస్థితి. 2017 అక్టోబర్‌లోనే పనులు ప్రారంభించారు. ఐదు నెలలుగా పైప్‌లైన్ల ఏర్పాటు పనులు సాగుతున్నాయి.

హైవే, రైల్వే క్రాసింగ్‌ అడ్డంకులు
పెనుకొండ శివారులోని రైల్వే క్రాసింగ్‌.. చకర్లపల్లి, మలుగూరు రైల్వే క్రాసింగ్‌లు పైపులైన్ల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన అనుమతుల వ్యవహారం రైల్వే అధికారుల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వెంకటాపురం వద్ద ఆటవీ ప్రాంతంలోనూ పైప్‌లైన్‌ పనులు చేపట్టాడానికి భూములు సేకరించాల్సి ఉంది. ఇకపోతే ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు కూడా మంజూరు కాకపోవడం గమనార్హం. ఇటీవల అమృత్‌ పథకం కింద రూ.5కోట్లు మంజూరైతే మున్సిపల్‌ అధికారులు ఈ ప్రాజెక్టుకు మళ్లించారు. పూర్తిస్థాయిలో నిధులు మంజూరు కాకపోవడం కూడా పనులు మందకొడిగా సాగేందుకు కారణమవుతోంది.

వేసవిలో చుక్కలు చూడాల్సిందే..
పట్టణంలో 1.62 లక్షల జనాభాకు ప్రతిరోజు సుమారు 10ఎంఎల్‌డీ నీరు అవసరం అవుతోంది. మున్సిపాల్టీకి ప్రధాన నీటి సరఫరా పథకంమైనా పీఏబీఆర్‌ నుంచి ఇప్పటి వరకు రోజుకు సగటున 3.5 ఎంఎల్‌డీ మించి నీరు సరఫరా కావడం లేదు. మున్సిపాల్టీ పరిధిలోని 150 బోర్లు ఉండగా.. ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు 2 ఎంఎల్‌డీ నీరు అందిస్తున్నారు. ఇందులో కూడా ఇప్పటికే దాదాపు 20 బోర్లు ఎండిపోయి నీటిలభ్యత తగ్గిపోయింది. కుళాయిలకు 10 నుంచి 15 రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు.
పనుల్లో వేగం పెంచుతాం :  ప్రసాద్, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈపైపులైన్‌ పనులను కొనసాగుతున్నాయి. కేంద్రం నిధులు విడతల వారీగా మంజూరవుతాయి. ఈ వేసవి లోపు పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. అయితే పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు చేపడతాం.

నీళ్లు ఎలా తెస్తారు
గొల్లపల్లి రిజర్వాయర్‌కే పూర్తిస్థాయిలో అధికారంగా నీటి కేటాయింపులు లేవు. బ్యాక్‌వాటర్‌ వస్తే హంద్రీనీవా నుంచి గొల్లపల్లి రిజర్వాయర్‌ నింపుకొవాలి. అక్కడి నుంచి హిందూపురం పైప్‌లైన్‌కు పంపింగ్‌ చేయాలి. అలా కాకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేసిన శ్రీరామిరెడ్డి తాగునీటి పైప్‌లైన్‌ను పటిష్టపర్చి దెబ్బతిన్న పైపులను మార్చి పంపింగ్‌ చేస్తే ప్రతిరోజు పట్టణానికి 10 ఎంఎల్‌డి నీటిని తీసుకోవచ్చు. రోజూ కుళాయిలకు నీరు వదలవచ్చు. – ప్రశాంత్‌గౌడ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజనప్రధాన కార్యదర్శి. హిందూపురం

15 రోజులుగా మంచినీరు రాలేదు
మోడల్‌కాలనీ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటోంది. మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ట్యాంకర్లను పంపుతామంటారే కానీ రావు. ఒకటి రెండు పంపినా ప్రజలకు ఏమాత్రం సరిపోవు. ప్రస్తుతం 15 రోజులుగా నీరు రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వేసవిని తల్చుకుంటే భయమేస్తోంది. – చంద్రకళ, మోడల్‌కాలనీ, హిందూపురం

ఎమ్మెల్యే మాట నీటి మీద బుడగ
ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలు నీటిమీద బుడగలు. నిధులు పూర్తిస్థాయిలో రాకపోయినా ఈ వేసవికి నీళ్లు ఇస్తామన్నారు. నిధుల లేమితో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒకవేళ గొల్లపల్లి నుంచి పైప్‌లైన్‌ పనులు పూర్తి చేసినా కియా ఫ్యాక్టరీకి నీరు ఇవ్వడమే తప్ప హిందూపురం ప్రజల కోసం కాదని అనిపిస్తోంది. శ్రీరామి రెడ్డి తాగునీటి పథకం పైప్‌లైన్‌ను మరమ్మతు చేస్తే ఉపయోగకరం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top