అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే, అన్నా డీఎంకే

Dmk, Aiadmk Announcements on Lok Sabha Candidates - Sakshi

కనిమొళి, దయానిధి మారన్‌ సహా పలువురికి డీఎంకే టికెట్లు

చెన్నై: తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు లోక్‌సభ ఎన్నికల కోసం తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించాయి. కనిమొళి, దయానిధి మారన్, ఎ.రాజ, టీఆర్‌ బాలు సహా పలువురికి డీఎంకే లోక్‌సభ టికెట్లను కేటాయించింది. డీఎంకే జాబితాలో ఏకంగా 12 కొత్త ముఖాలున్నాయి. 20లో ఇద్దరు మహిళలకు మాత్రమే ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌తోపాటు తమిళనాడులోని పలు చిన్న పార్టీలు, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీతోపాటు చిన్న పార్టీలు ఉండటం తెలిసిందే.  అన్నాడీఎంకే తమ పార్టీనేగాక, కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించింది.

తమిళనాడు, పుదుచ్చేరిల్లో కలిపి 40 లోక్‌సభ స్థానాలుండగా, డీఎంకే, అన్నాడీఎంకేలు రెండూ చెరో 20 స్థానాల్లో పోటీ చేస్తూ మిగిలిన 20 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేశాయి. 8 స్థానాల్లో ఇరు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది. డీఎంకే కూటమిలో అత్యధికంగా కాంగ్రెస్‌కు పది స్థానాలు దక్కగా, సీపీఐ, సీపీఎం, వీసీకేలు చెరో రెండు, మిగిలిన చిన్న పార్టీలు తలో సీటును దక్కించుకున్నాయి. ఇక అన్నా డీఎంకే కూటమిలో పీఎంకే 7, బీజేపీ 5, డీఎండీకే 4 చోట్ల పోటీ చేయనున్నాయి. మిగిలిన నాలుగు సీట్లను చిన్న పార్టీలకిచ్చారు.

తొలిసారి లోక్‌సభకు కనిమొళి పోటీ
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సోదరి కనిమొళి తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉండగా, ఆ పదవీకాలం ఈ జూలైతో ముగియనుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.  లోక్‌సభ ఎన్నికలతోపాటే తమిళనాడు లో 18 నియోజకవర్గాలకు శాసనసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా డీఎంకే ప్రకటించింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top