‘ముస్లిం మహిళ వెనుక పరిగెత్తడం మాత్రమే తెలుసు’

Dinesh Gundo Rao Salms Anant Kumar Hegde For His Comments Over Personal Life - Sakshi

కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే, కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ దినేష్‌ గుండూరావుల మధ్య సోషల్‌ మీడియా వేదికగా విమర్శల యుద్ధం కొనసాగుతోంది. ఆదివారం కొడగులో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనంత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హిందూ మహిళలను తాకిన చేయి ఎవరిదైనా సరే కులమతాలకు అతీతంగా ఆ చేతిని నరికేయాల్సిందే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెగ్డే వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ దినేష్‌ గుండూరావు... ‘ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నందుకు మీరు సాధించిందేమిటి? కర్ణాటక అభివృద్ధిలో మీ పాత్ర ఎంత? ఇలాంటి వ్యక్తులను ఎంపీలుగా, మంత్రులుగా కలిగి ఉండటం విచారకరం’ అని ట్వీట్‌ చేశారు.

ఇందుకు స్పందనగా.. ‘దినేష్‌ గుండూరావుకు నేను కచ్చితంగా సమాధానం ఇచ్చితీరతాను. అయితే అంతకన్నా ముందు తన విజయాల వెనుక ఎవరు ఉన్నారనే ప్రశ్నకి ఆయన బదులివ్వాలి. నాకు తెలిసినంత వరకు ఓ ముస్లిం మహిళ వెంట పడటం మాత్రమే తనకు తెలుసు’ అంటూ అనంత్‌ కుమార్‌ విమర్శించారు. దీంతో.. ‘ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ అనంత్‌ కుమార్‌ తన స్థాయిని దిగజార్చుకున్నారు. నాకు తెలిసి ఆయనకు సంస్కారం లేదు. హిందూ వేదాలు ఆయనకు ఏమీ నేర్పలేదేమో. ఇంకా సమయం మించి పోలేదు. ఇప్పటికైనా పద్ధతైన మనిషిగా మారేందుకు అవకాశం ఉంది’ అంటూ దినేష్‌ రావు ఘాటుగా స్పందించారు.

కాగా దినేష్‌ గుండూరావు టబూ అనే ముస్లిం మహిళను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మతాంతర వివాహాన్ని కారణంగా చూపి బీజేపీ ఎంపీ శోభా కరాంద్లజే, ప్రతాప్‌ సింహా తదితర నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో దినేష్‌ గుండూరావుని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో.. తానేమీ రాజకీయాల్లో లేనని, తన మతం గురించి ప్రస్తావించి దినేష్‌ను ఇబ్బంది పెట్టడం సరైంది కాదంటూ టబూ రావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top