కారు–కమలం మాటల యుద్ధం

Dialogue War Between TRS And BJP - Sakshi

వాడివేడిగా సాగిన టీఆర్‌ఎస్, బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం

జాతీయ రాజకీయాలు లక్ష్యంగా మోదీపై విమర్శలు చేసిన కేసీఆర్‌

ప్రధాని పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శలు

టీఆర్‌ఎస్‌ లక్ష్యంగానే వాగ్బాణాలు సంధించిన మోదీ, షా

కుటుంబ శ్రేయస్సు తప్ప కేసీఆర్‌ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని ధ్వజం  

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేపట్టాయి. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, ఇతర పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్టీ లు నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం భిన్నంగా సాగిందని రాజకీయ వర్గాలంటున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగిందని, ఇరు పార్టీల్లోని అగ్రనేతలు పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారని చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జాతీయస్థాయి రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కమలనాథులపై విరుచుకుపడగా ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా సైతం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. 

జాతీయ రాజకీయాలపై టీఆర్‌ఎస్‌ దృష్టి... 
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పూర్తిగా ట్రెండ్‌ మార్చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఏకరువు పెట్టిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌... ఈసారి బీజేపీ, మోదీలే టార్గెట్‌గా ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలో తాము ప్రవేవపెట్టిన రైతుబంధు పథకాన్ని ప్రధాని కాపీకొట్టారని మండిపడ్డారు. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తూ ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని మోదీ దిగజార్చారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాక్‌ భూభాగంపై జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను రాజకీయం చేశారని ఆరోపించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ ద్వారా వైమానిక దళం 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిందంటూ ఎలాంటి ఆధారాలు చూపకుండానే ప్రచారం చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే దేశానికి దిక్సూచి అయ్యాయని చెప్పుకుంటూ వచ్చారు.

జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌తోపాటు తెలంగాణ రాష్ట్రం కీలకం కావాలంటే 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. దేశానికి జిమ్మేదార్‌ అవసరమంటూ మోదీ తెరపైకి తెచ్చిన ‘చౌకీదార్‌’నినాదాన్ని ఎద్దేవా చేశారు. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా దేశానికి చేసిందేమీ లేదని, నామమాత్రపు అభివృద్ధితో సరిపెట్టి దేశానికి అవసరమైన పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడంలో విఫలమైందని కేసీఆర్‌ ఆరోపించారు. జలవనరుల వినియోగం, విద్యుత్‌ లాంటి విషయాల్లో సరైన ప్రణాళిక లేకుండా జాతీయ పార్టీలు పాలించాయని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏకి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని, భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని పదేపదే చెప్పడం ద్వారా ఓటర్ల మనసును జాతీయ పార్టీల నుంచి దూరం చేసే ప్రయత్నంలో ఆయన కొంతమేర సఫలీకృతమయ్యారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. 

బీజేపీ ఎదురుదాడి... 
కమలదళం సైతం టీఆర్‌ఎస్‌పైనే ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా విమర్శలు చేసింది. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తాము దేశానికి, రాష్ట్రానికి చేసిన మేలును చెప్పడంతోపాటు టీఆర్‌ఎస్, కేసీఆర్‌ కుటుంబంపై మండిపడ్డారు. కేసీఆర్‌కు దేశం ముఖ్యం కాదని, కుటుంబమే ముఖ్యమని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ కోరుతున్నట్లు 16 సీట్లలో గెలిపిస్తే కేసీఆర్‌ ప్రధాని అవుతారా.. ఆ సత్తా ఆయనకు ఉందా? అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికే 15 మంది ఎంపీలు ఉన్నా కేసీఆర్‌ కేంద్రం నుంచి ఏమీ సాధించలేదని, ఇప్పుడు 16 మందిని ఇచ్చినా ఏం సాధిస్తారని నిలదీశారు. దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఉన్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలతోపాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగితే ఓడిపోతాననే భయంతోనే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్‌ వెళ్లారని మోదీ విమర్శించారు.

తెలంగాణ అమరవీరుల త్యాగాలకు విలువ లేకుండా కేసీఆర్‌ పాలన సాగించారని విమర్శిస్తూ జాతీయ పార్టీగా తమను ఆదరిస్తే అన్ని విధాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి తాము నిధులు ఇవ్వలేదన్న కేసీఆర్‌ మాటలు అబద్ధమని, తామిచ్చిన నిధులు ఎవరూ ఇవ్వలేదని ఎన్నికల సభల్లో చెప్పుకొచ్చారు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, స్మృతీ ఇరానీ, షానవాజ్‌ హుస్సేన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, మురళీధర్‌రావు విస్తృత ప్రచారం నిర్వహించారు. 

మేనిఫెస్టోపైనే కాంగ్రెస్‌ ఆశలు... 
ప్రతిపక్ష కాంగ్రెస్‌ కొంత చప్పగా ప్రచారం నిర్వహించినా కేవలం ఆ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పరిమితమైంది. ముఖ్యంగా కనీస ఆదాయ హామీ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ. 72 వేలు ఇచ్చే పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. ఇతర పార్టీలు ఇచ్చే మందు, పంచే డబ్బు కావాలో, ఏటా రూ. 72 వేలు కావాలో తేల్చుకోవాలని కాంగ్రెస్‌ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా పోటీ చేస్తుండటంతో వారంతా నియోజకవర్గాలకే పరిమితమవగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, అగ్రనేతలు గులాం నబీ ఆజాద్, సచిన్‌ పైలట్‌ లాంటి నేతలు ఈసారి ప్రచారానికి వచ్చారు. రాహుల్‌ ఒకేరోజు జహీరాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ స్థానాల పరిధిలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని తాము చేపట్టబోయే న్యాయ్‌ పథకం గురించే ఎక్కువగా చెప్పారు. బీజేపీ పేదలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తే తాము పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామని ఆయన పేదలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

మోదీ దేశ ప్రజలకు కాపలాదారు కాదని, పెట్టుబడిదారులకే ఆయన కాపలాదారుడని ఆరోపించారు. తమను గెలిపిస్తే రైల్వేలైన్లు ఏర్పాటు చేయిస్తామని, ప్రశ్నించే గొంతుకల కోసం తమను గెలిపించాలని, రాష్ట్రంలోని ఏదో ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి పెడతామని హామీ ఇచ్చారు. వామపక్షాలు కూడా ఎన్నికల బరిలో ప్రచారం నిర్వహించినప్పటికీ కాంగ్రెస్, బీజేపీలను విమర్శిస్తూనే ఆ పార్టీ నేతల ప్రచారం సాగింది. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కొంత భిన్నంగా జాతీయ రాజకీయాలే ప్రాతిపదికగా సాగిన పార్టీల ఎన్నికల ప్రచారం ఓటర్లను ఏ మేరకు ఆకర్షిస్తుందనేది మే 23న తేలనుంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top