సీఎం పదవికి ఫడ్నవిస్‌ రాజీనామా

Devendra Fadnavis Resignation To CM Post - Sakshi

అనూహ్యాంగా మారిన మహారాష్ట్ర రాజకీయాలు

సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామాలు

ఫలించిన శరద్‌ పవార్‌ వ్యూహాలు

సాక్షి, ముంబై: అసెంబ్లీ బలపరీక్షకు ముందే బీజేపీ వెనక్కితగ్గింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్‌ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ రాజీనామా చేసిన గంట వ్యవధిలోనే ఫడ్నవిస్‌ కూడా వైదొలిగారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 79 గంటల్లోనే ఆయన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు ముంబైలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఫడ్నవిస్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులను పోత్సహించే తత్వం తమది కాదని, ప్రతిపక్షనేతగా ప్రజల పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. కేవలం అధికారం కోసం ఏర్పడిన శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మధ్యలోనే కూలిపోక తప్పదని జోస్యం చెప్పారు.

బుధవారం సాయంత్రలోగా ఫడ్నవిస్‌ ప్రభుత్వం బలపరీక్షను ఎదర్కొవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎన్సీపీపై తిరుగుబాటు చేసేలా అజిత్‌ను ప్రోత్సహించిన బీజేపీ.. డిప్యూటీ సీఎంగా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించింది. అయితే అజిత్‌ వెంట కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారని భావించిన ఫడ్నవిస్‌ అంచనాలు తలకిందులయ్యాయి. శరద్‌ పవార్‌ చాతుర్యంతో అజిత్‌ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గుకురాలేమని భావించిన ఫడ్నవిస్‌ రాజీనామాను ప్రటకించారు.

రాజీనామా సందర్భంగా మీడియా సమావేశంలో ఫడ్నవిస్‌ మాట్లాడుతూ.. శివసేనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకున్న శివసేన ఆ తరువాత దారుణంగా మోసం చేసింది. అధికారం కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. ఓ వైపు మాతో మాట్లాడుతూ.. విపక్షాలతో చర్చలు జరిపింది. ప్రజల తీర్పుకు విరుద్ధంగా శివసేన వ్యవహరించింది. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉద్ధవ్‌ ఠాక్రే బేరాలకు దిగారు. ఎన్నికల్లో బీజేపీని అతిపెద్ద పార్టీగా మరాఠా ప్రజలు నిలిబెట్టారు. ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటా. అసెంబ్లీలో బలం లేనందును సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా’ అని ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top