మండలిలో టీడీపీ తీరు దురదృష్టకరం​

Deputy CM Pilli Subhash Chandra Bose Comments On TDP - Sakshi

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణ కమిటీ ముఖ్యమైన సూచనలు చేసింది. ఆ కమిటీ సూచనలను చంద్రబాబు పట్టించుకోలేదు. నారాయణ కమిటీ వేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేశారు. చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరి చేసేందుకు సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని’  డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

మండలిని రాజకీయ కేంద్రంగా టీడీపీ వినియోగించుకోవడం దురదృష్టకరమన్నారు. సభలో చేసిన చట్టాలకు సలహాలు, సూచనలు ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రాజకీయంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మండలిలో తీర్మానం మూవ్‌ కాలేదని చైర్మన్‌ స్వయంగా చెబుతున్నారని.. విస్తృత అధికారులు ఉన్నాయని సెలెక్ట్‌ కమిటీకి పంపడం సబబా అని ప్రశ్నించారు. ప్రజాసంపద అన్ని ప్రాంతాలకు సమానంగా ఖర్చు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం చేసిన చట్టాలను కూడా మండలిలో అడ్డుకున్నారన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని.. వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని.. లేకుంటే ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందన్నారు. మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందే.. సీఎం జగన్‌ తీర్మానాన్ని సమర్థిస్తున్నానని సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు.‍

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top