మళ్లీ దత్తన్న! | Dattatreya Trying to Competition From Secunderabad Lok Sabha | Sakshi
Sakshi News home page

మళ్లీ దత్తన్న!

Feb 4 2019 12:08 PM | Updated on Feb 4 2019 12:08 PM

Dattatreya Trying to Competition From Secunderabad Lok Sabha - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు విజయం సాధించిన బండారు దత్తాత్రేయ మరోసారి బరిలో నిలిచేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు ఆదివారం జరిగిన రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దత్తాత్రేయ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి అరవింద్‌ నింబావలి వద్ద తన మనోగతాన్ని వెల్లడించారు. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనల్లో మాజీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, డాక్టర్‌ లక్ష్మణ్‌ సైతం ఉన్నారు. ఈ ఇద్దరూ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం, డాక్టర్‌ లక్ష్మణ్‌కు బీజేపీ అధ్యక్ష పదవి ఉండడం వల్ల తనకు చివరిసారిగాఅవకాశం కల్పించాలని దత్తాత్రేయ పార్టీ ఎన్నికల కమిటీకి నివేదించాలని నిర్ణయించారు. ఇప్పటికే బూత్‌ కమిటీలు, శక్తి కేంద్రాల ఏర్పాటును సైతం వేగవంతం చేశారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ భారీగా వెనకబడిపోయింది. అయినా లోక్‌సభకు వచ్చేసరికి పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాలో బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో దత్తాత్రేయతో పాటు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ సైతం సికింద్రాబాద్‌ స్థానంపై ఆసక్తి చూపుతున్నారు. 

హైదరాబాద్‌కు రాజాసింగ్‌
గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథాను హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి  పోటీకి దించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని నిలబడ్డ రాజాసింగ్‌ అయితేనే హైదరాబాద్‌ లోక్‌సభలో పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్తేజం వస్తుందన్న భావనను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక చేవెళ్ల లోక్‌సభకు నియోకజవర్గ ఇన్‌చార్జి బి.జనార్దన్‌రెడ్డిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లోనూ తనకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి కోరే అవకాశం ఉన్నా, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలవడం వల్ల కొత్త అభ్యర్థి జనార్దన్‌రెడ్డి వైపు ఎన్నికల కమిటీ మొగ్గుచూపే అవకాశం ఉందని సమాచారం.

ఇక మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని పార్టీకి చెందిన ముఖ్య నాయకుల్లో ఒకరికి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఈనెల 5న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోకజవర్గాల ఎన్నికల సమావేశాన్ని ఇంíపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హాజరై గెలిచే అభ్యర్థులెవరన్న అంశాన్ని పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 11న షాద్‌నగర్‌లో నిర్వహించే చేవెళ్ల నియోజకవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరు కానున్నారు. వీలైనంత త్వరంగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అందరి కంటే ముందుగా ప్రచారాన్ని హోరెత్తించే దిశగా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement