బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ అగ్రనేత భార్య

Damodar Raja Narasimha Wife Padmini Join In BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌కు ఊహించని విధంగా షాక్‌ తగిలింది. ఎవరూ ఊహించనివిధంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో రాజకీయ వర్గల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌ రావు, రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్‌లు గురువారం ఆ పార్టీ కార్యాలయంలో బీజేపీ కండువాతో ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మురళీధర్‌ రావు మీడియాతో మాట్లాడుతూ ‘పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. ఆమె చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతమవుతుంది. దేవాలయాల పునరుద్దరణలో ఆమె కృషి అభినందనీయం. రాబోయే రోజులో వారి సేవలు వినియోగించుకుంటాం. ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై పద్మినీ బీజేపీ పార్టీలో చేరార’ని తెలిపారు.    

మహిళా రుణాలు పూర్తిగా మాఫీ
బీజేపీలోకి పద్మినీ రెడ్డిని ఆహ్వానిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉన్నా తప్పేం కాదని, ఆ స్వేచ్చ వారికి ఉందని తెలిపారు. మహిళా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఉంటుందని వెల్లడించారు.

దామోదరకు సంకటం

కాంగ్రెస్‌ పార్టీలో అగ్ర నాయకుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి బీజేపీలో చేరడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉండటం​ ఏంటని చర్చించుకుంటున్నారు. తన సతీమణి ప్రత్యర్థి పార్టీలో చేరడంతో మున్ముందు దామోదరకు ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు ఆయన ఏవిధంగా కాచుకుంటారో చూడాలి. అయితే బీజేపీలో చేరేందుకు పద్మినీ రెడ్డి తన భర్తను అనుమతి తీసుకున్నారా, లేదా అనేది ఆస​క్తికరంగా మారింది.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top