సీపీఎం మహాసభల్లో కీలక తీర్మానాలు

CPM Resolutions In The Mahasabha - Sakshi

సాక్షి, హైదారాబాద్‌: జాతీయ మహాసభల్లో భాగంగా పలు కీలక తీర్మానాలపై చర్చించినట్టు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్‌ తెలిపారు. రాజకీయ తీర్మానంపై గురువారం చర్చ ముగిసిందని, తీర్మానంపై 47 మంది ప్రతినిదులు ప్రసంగించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారని కారత్‌ తెలిపారు. 286 ప్రతిపాదనల్లో చర్చలో వచ్చిన సూచనలతో  కొన్ని మార్పులు చేసి రాజకీయ తీర్మానం సిద్ధంచేశామని, ఇవాళ పూర్తి స్థాయి రాజకీయ తీర్మానం ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ రాజకీయ నిర్మాణం పై తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చిస్తామన్నారు.

చర్చలో భాగంగా 15వ ఆర్థిక సంఘం సూచనలు, దక్షణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై చర్చించామని తెలిపారు. 1971 జనాభా ప్రాతిపదికన కాకుండా 2011 లెక్కల ప్రకారం నిదుల కేటాయింపు సరికాదని, అలా  అయితే జనాభా నియంత్రణ సక్రమంగా జరిపిన రాష్ట్రాలు నష్టపోతాయని తీర్మానంలో చర్చించినట్లు కారత్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా సంక్షేమ పథకాలు కుదించటం సరికాదని విమర్శించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల భద్రతపై మరో తీర్మానం ప్రవేశపెట్టగా,  ప్రైవేట్‌ సెక్టార్‌లో కార్మికులు, ఉద్యోగుల చట్టాల అమలుపై కార్మిక సంఘాల సూచనలను పరిశీలించారు.  సభలో ప్రవేశపెట్టిన రెండు ముసాయిదాలపై వచ్చిన సవరణలకు సమాధానం  ఉంటుందని, ముసాయిదాలపై ఏకాభిప్రాయం కుదరకపోతే ఓటింగ్‌ నిర్వహిస్తామని కారత్‌ తెలిపారు. 

ఓటింగ్‌కు  ఏ సభ్యుడైనా డిమాండ్‌ చేయవచ్చునని, పార్టీలో రహాస్య ఓటింగ్‌ విధానం లేనందున  ప్రతినిదులు రహస్య ఓటింగ్‌ కోరితే ఆలోచిస్తామని తెలిపారు. ఓటింగ్‌లో తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులందరూ పాటించాలని, అప్పుడు మెజారిటీ, మెనారిటీ అ​న్న ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు.  పార్టీ సెంట్రల్‌ కమిటీ కంటే పార్టీ కాంగ్రెస్‌ ఉన్నతమైనదని, కీలక అంశాలపై ఇక్కడ స్పష్టమైన ముగింపు ఉంటుందని ప్రకాష్‌ కారత్‌ స్పష్టంచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top