రహస్య భేటీ: ప్రజల్లో గందరగోళం!

CPM Madhu Demands Nimmagadda Ramesh Explanation Over Hyderabad Meeting - Sakshi

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషనర్‌ నియామకం వివాదంగా మారి కోర్టుకెక్కిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బీజేపీ నాయకులను ప్రత్యేకంగా కలవడం అనేక అనుమానాలకు తావిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఎటువంటి అపోహలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  నిజాయితీగా ఉండడమే కాదు.. అలా ఉన్నట్టు కూడా వ్యవహరించాలని విమర్శించారు. లేనిపక్షంలో ప్రజల్లో రాజ్యాంగ సంస్థల పట్ల విశ్వసనీయత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. (హైదరాబాద్‌ స్టార్‌ హోటల్‌లో గూడుపుఠాణి!)

ఈ మేరకు బుధవారం మధు మాట్లాడుతూ.. ‘‘ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల మధ్య సమావేశం  జరిగినట్లు వార్త బయటకు వచ్చింది. ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌‌లో ఈ సమావేశం జరిగింది. (ఆ ముగ్గురి వ్యాపార లావాదేవీలు ఏమై ఉంటాయబ్బా?)

ఇక ఇందుకు సంబంధించిన వీడియో రికార్డులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా..  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సర్వీసు నిబంధనలు, పదవీ కాలాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్, కొత్త ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top