శివసేనతో ‘చేయి’ కలపం: ఎన్సీపీ

Congress will not support Shiv Sena to keep BJP out of power - Sakshi

ముంబై: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు శివసేనతో చేతులు కలపబోమని శుక్రవారం కాంగ్రెస్, ఎన్సీపీ స్పష్టం చేశాయి. తమను విపక్షంలో కూర్చోమన్న ప్రజా తీర్పును శిరసావహిస్తామని మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బాలాసాహెబ్‌ తోరట్‌ పేర్కొన్నారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతివ్వాలన్న ఆలోచన కానీ ప్రతిపాదన కానీ లేదని చెప్పారు.

ఒకవేళ మద్దతు కోరుతూ శివసేన తమ వద్దకు వస్తే పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. శివసేనతో పొత్తు వార్తను ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తోసిపుచ్చారు. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో కలిసి భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో.. అధికార పంపిణీ విషయంలో మిత్రపక్షం శివసేన 50:50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న డిమాండ్‌ను శివసేన ముందుకు తెచ్చింది.  


బీజేపీకి తగ్గిన ఓట్ల శాతం..
గురువారం వెలువడిన ఎన్నికల పలితాల్లో బీజేపీ సత్తా చాటినప్పటికీ గతంతో పోలిస్తే ఓటుశాతం తగ్గింది. తమ మిత్రపార్టీతో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనా.. ఓటు షేర్‌ మాత్రం కోల్పోయింది.  2014లో బీజేపీ పోటీ చేసిన 260 సీట్లలో 122 స్థానాల్లో విజయం సాధించగా, పస్తుతం ఆ సంఖ్య 105కు పడిపోయింది. గతంలో 27.8 శాతంగా ఉన్న బీజేపీ ఓటు షేరు రెండు శాతం కోల్పోయి 25.7తో ఆగిపోయింది. శివసేన ప్రస్తుతం 56 సీట్లు సాధించింది. అయితే ఓటు షేరు మాత్రం 2.9 శాతం కోల్పోయింది. ఎన్సీపీ ఓటు షేరు గతంలో 17.2 శాతం ఉండగా ప్రస్తుతం 16.7శాతానికి తగ్గింది. గతంలో 41 సీట్లు గెలుచుకోగా ఇప్పుడు 54 సీట్లు సాధించింది. కాంగ్రెస్‌ గతంలో 18 శాతం ఓట్లను కలిగి ఉండగా ఇప్పుడది 15.9కి పడిపోయింది. అయితే సీట్ల సంఖ్యను మాత్రం 42 నుంచి 44కు పెంచుకుంది. రాజ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన 2.3 శాతం ఓటు షేరును సాధించింది.

తొలి ప్రయత్నంలోనే...
నాగ్‌పూర్‌: ఈఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన అభ్యర్థులు కూడా సత్తా చూపారు. మొత్తం 12 స్థానాల్లో మొదటిసారి బరిలో దిగిన అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. అందులో కొందరు సీనియర్‌ నేతలపై విజయం సాధించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top