కేసీఆర్‌ది ప్రజావ్యతిరేక పాలన

Congress MLA Komatireddy Rajagopal Reddy Slams CM KCR - Sakshi

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు : కేసీఆర్‌ది ప్రజావ్యతిరేక పాలన అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం మునుగోడులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే మునుగోడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేదని, తాము వైఎస్‌ అభిమానులమని, ఆయన చలువతోనే ఉదయసముద్రం ప్రాజెక్టు మంజూరు చేయించి 90 శాతం పనులు పూర్తి చేయించామన్నారు. కానీ ప్రాజెక్టు పూర్తయితే కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ఎక్కడ పేరు వస్తుందోనని సీఎం కేసీఆర్‌ స్వార్థంతో 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేసీఆర్‌ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, రానున్న రోజులల్లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం అన్నారు. ప్రతి కార్యకర్త ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. బరిలో నిలిచే అభ్యర్థులను 15 మందితో ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు ఎంపిక చేస్తారని, వారి సూచనల ప్రకారం గెలుపునకు శ్రమించాలన్నారు. ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అందరిని కలుపుకొని ఆయా గ్రామాల్లోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్‌నేత,  రాష్ట్ర కార్యదర్శి కుంభం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పొలగోని సత్యంగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు జాల వెంకన్నగౌడ్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు గుర్రం సత్యం, బూడిద లింగయ్య యాదవ్, పాలకూరి యాదయ్యగౌడ్, దేశిడి యాదయ్యగౌడ్, గోవర్ధన్‌రెడ్డి, చెరుపల్లి వెంకన్న, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top