కాంగ్రెస్‌కే రెవెన్యూ శాఖ?

Congress May Get Revenue Ministry In Maharashtra - Sakshi

ఎన్సీపీకి హోం, శివసేనకు నగరాభివృద్ది శాఖలు! 

సోమవారం నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు

సాక్షి, ముంబై: శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడి కూటమి ప్రభుత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి రెవెన్యూ, ఎన్సీపీకి హోం శాఖలు కేటాయించేలా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మహా వికాస్‌ ఆఘాడి కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏ శాఖలు కేటాయించాలనే దానిపై ఒక స్పష్టత రాకపోవడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతోందని తెలుస్తోంది. దీంతో ఈ నెల 16వ తేదీ (వచ్చే సోమవారం) నుంచి నాగ్‌పూర్‌లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కేవలం ఐదు రోజులపాటు సాగే ఈ సమావేశాలు పూర్తికాగానే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందులో శివసేనకు నగరాభివృద్ధి శాఖ, ఎన్సీపీకి హోం శాఖ, కాంగ్రెస్‌కు రెవెన్యూ శాఖ కట్టబెట్టే సూచనలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

పక్షం రోజులు గడిచినా.. 
మహా వికాస్‌ ఆఘాడి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే కొనసాగుతున్నారు. కాగా, ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పక్షం రోజులు కావస్తోంది. ఆ సమయంలో ఉద్ధవ్‌తోపాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, ఇంతవరకు వారికి శాఖలు కేటాయించకపోవడమే గాకుండా మంత్రివర్గ విస్తరణ కూడా జరగలేదు. మంత్రివర్గ విస్తరణకు శివసేన, ఎన్సీపీ జాబితా సిద్ధంగా ఉంది. కాని కాంగ్రెస్‌ నిర్ణయం మాత్రం ఢిల్లీలో అధిష్టానం ద్వారా జరుగుతుంది. దీంతో విస్తరణలో జాప్యం జరుగుతోంది. ఇదిలాఉండగా మంత్రివర్గ విస్తరణతోపాటు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వంలో వివిధ శాఖలతో పోలిస్తే నగరాభివృద్ధి, రెవెన్యు, హోం శాఖలకు ప్రాధాన్యత ఉంది. దీంతో ఈ మూడు శాఖలను మూడు పార్టీలకు కేటాయించాలని నిర్ణయించినట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. వచ్చే సోమవారం నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ లోపే ఈ మూడు కీలక శాఖలు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రి వర్గ విస్తరణ చేయాలని కొందరు నేతలు పట్టుబడుతున్నారు. కాని మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల తరువాతే మంత్రివర్గ విస్తరణ చేయాలని మరికొందరు నేతలు అంటున్నారు. మంత్రుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరగా శాఖల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తి  చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఎవరికి...? ఏ శాఖలు..? కేటాయిస్తారనే దానిపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల మంత్రులు, పదాధికారులతోపాటు యావత్‌ రాష్ట్ర ప్రజల దృష్టి ఇటువైపుఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top