టార్గెట్‌.. అనిల్‌

Congress And BJP Candidates Target On TRS Candidates - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జెడ్పీచైర్మన్‌ పదవి ఆశిస్తూ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి నేరడిగొండ జెడ్పీటీసీగా బరిలోకి దిగిన అనిల్‌ జాదవ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు కొందరు సిద్ధమయ్యారు. ఇదే అదనుగా ఆయనను రాజకీయంగా దెబ్బతీసేందుకు లోస్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్, బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ఎత్తుగడలు వేస్తున్నారు. ఎస్టీ (జనరల్‌) రిజర్వు అయిన ఆదిలాబాద్‌ జెడ్పీచైర్మన్‌ పదవిపై అధికార పార్టీ నుంచి అనిల్‌ జాదవ్‌ ఆశలు పెట్టుకున్నారు. ఆయనను జెడ్పీటీసీగానే ఇక్కడే నిలువరించడం ద్వారా రాజకీయంగా దెబ్బతీయాలని వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అనిల్‌ జాదవ్‌పై వారిద్దరు ఎందుకు దృష్టి పెట్టాల్సి వస్తుందంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలప్పుడు జరిగిన పరిణామాలు ఇందుకు కారణమవుతున్నాయి.

అనిల్‌ ఓటమికి ఎత్తుగడలు 
నేరడిగొండ జెడ్పీటీసీ స్థానం ఎస్టీ (జనరల్‌) రిజర్వు అయింది. అనిల్‌జాదవ్‌ టీఆర్‌ఎస్‌ నుంచి ఇక్కడ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సోయం, రాథోడ్‌ నేరడిగొండలో అనిల్‌ను ఎలాగైనా నిలువరించాలని ఎత్తుగడలు వేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనిల్‌ జాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. బోథ్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ నుంచి సోయం బాపురావు, అనిల్‌ జాదవ్‌ టికెట్‌ ఆశించారు. 2009, 2014లో బోథ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అనిల్‌ జాదవ్‌ పోటీ చేసినా ఓటమి చెందారు.

దీంతో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్టానం సోయం పేరును ఖరారు చేయడంతో అనిల్‌జాదవ్‌ నిరుత్సాహం చెందారు. కాంగ్రెస్‌ రెబల్‌గా ఆయన బోథ్‌ నుంచి పోటీ చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన రాథోడ్‌ బాపురావు ఆ నియోజకవర్గంలో వరుసగా మరోసారి గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు 6,400పై చిలుకు ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. కాంగ్రెస్‌ రెబల్‌గా పోటీ చేసిన అనిల్‌ జాదవ్‌ 28 వేల ఓట్లు సాధించినా ఓటమి చెందాడు. అయితే అనిల్‌ రెబల్‌గా పోటీ చేయడంతోనే సోయం బాపురావు ఓటమి పాలయ్యాడని అనుచరులు మదన పడ్డారు. ఈ నేపథ్యంలో అనిల్‌పై రాజకీయ అదను కోసం సోయం బాపురావు ఎదురు చూస్తుండగా ఇప్పుడు అవకాశం లభించింది.
 
రాథోడ్‌కు ఇలా..
అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ రెబల్‌గా పోటీ చేసిన అనిల్‌ జాదవ్‌ను అప్పట్లో అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఎన్నికల అనంతరం సస్పెన్షన్‌ ఎత్తివేశారు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ అధిష్టానం రాథోడ్‌ రమేశ్‌ను ఆదిలాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు. అనిల్‌ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు యత్నిస్తున్నాడన్న సమాచారం మేరకు రాథోడ్‌ రమేశ్‌ రంగలోకి దిగాడు. ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలోని బోథ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నా యకులను సమన్వయం చేసుకునేందుకు రాథోడ్‌ రమేశ్‌ యత్నించారు.

అందులో భాగంగా అప్ప ట్లో అనిల్‌జాదవ్‌ను రాథోడ్‌ రమేశ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, భార్గవ్‌దేశ్‌ పాండేలు కలిసి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లకుండా నిరోధించేందుకు ప్రయత్నిం చారు. అయినా నామినేషన్ల పర్వం నడుస్తున్న సందర్భంలో అనిల్‌జాదవ్‌ హైదరాబాద్‌లో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ పరిణామం రాథోడ్‌ రమేశ్‌కు కంటగింపుగా మారింది. తాను స్వయంగా వెళ్లి కలిసినా అనిల్‌ జాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరడంపై ఆయనలో ఆగ్రహం వ్యక్తం అయింది. రాజకీయంగా అనిల్‌పై ప్రతీకారం పెంచుకున్నాడు. అదును కోసం ఎదురుచూస్తుండగా ఇప్పుడు జెడ్పీచైర్మన్‌ ఆశతో నేరడిగొండ జెడ్పీటీసీగా బరిలో దిగిన అనిల్‌జాదవ్‌ను ఓడించేందుకు నేరడిగొండపై ప్రత్యేక దృష్టి సారించారు.

పాచిక..
సోయం బాపురావు, రాథోడ్‌ రమేశ్‌లు ఇద్దరు నేరడిగొండ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న అనిల్‌ జాదవ్‌ను ఎలాగైనా ఓడించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీ నుంచి ఆదివాసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలని సోయం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన అనిల్‌ జాదవ్‌కు ఆ సామాజికవర్గం ఓట్లు పడకుండా కాంగ్రెస్‌ నుంచి లంబాడా సామాజిక వర్గానికి చెందిన నాయకున్ని జెడ్పీటీసీగా బరిలోకి దించాలని రాథోడ్‌ రమేశ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇరువురి నేతలు ఇటీవల నేరడిగొండలో పర్యటించి కార్యకర్తలతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో నేరడిగొండలో జెడ్పీటీసీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

బరిలో...
జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికల నామినేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకే ఆ పార్టీ బీ–ఫామ్‌ ఇస్తారు. అయితే అనిల్‌ జాదవ్‌ మొదటి రోజే బీ–ఫామ్‌ లేకుండానే నామినేషన్‌ వేశారు. పరోక్షంగా పార్టీలో ఎవరినో హెచ్చరించేందుకే ఆయన నామినేషన్‌ వేశారనేది పార్టీలో చర్చ సాగుతోంది. ఆదివారం బీ–ఫామ్‌తో మందిమార్బలంతో వచ్చి మరోసారి నామినేషన్‌ వేస్తానని అని ల్‌ తన అనుచర గణంతో పేర్కొన్నారు. అయితే అనిల్‌ జాదవ్‌ నేరడిగొండ నుంచి జెడ్పీటీసీగా బరిలో ఉండడం ఓ ముఖ్యనేతకు అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా రేపటి నాడు జెడ్పీచైర్మన్‌గా ఉన్నత పదవిలో ఉంటే బోథ్‌ నియోజకవర్గంలో బలమైన నేతగా తయారై పార్టీలోనే పోటీగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే కొంతమంది ముఖ్యనేతలు ఆశీస్సులు ఉండటంతోనే అనిల్‌ జాదవ్‌ పోటీకి రెడీ అవుతున్నట్లు చర్చ సాగుతోంది. ఏదేమైనా ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top