మంచిర్యాల: పోరు త్రిముఖం

Competition Among Three Main Parties In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల: లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేడెక్కనుంది. మొన్న నామినేషన్ల దాఖలు... నిన్న పరిశీలన పూర్తి కాగా.. తాజాగా గురువారం ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇక ప్రచార పర్వానికి తెరలేవనుంది. శుక్రవారం నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ రెబల్‌గా నామినేషన్‌ వేసిన నరేశ్‌ జాదవ్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. పెద్దపల్లిలో మాత్రం ఏ అభ్యర్థి కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోవడం గమనార్హం.

ఆదిలాబాద్‌లో 11 మంది.. 
ఆదిలాబాద్‌ లోకసభ స్థానానికి 11 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఇతర పార్టీలు, స్వతంత్రులుగా మొత్తం 11 మంది బరిలో మిగిలారు. తొలుత 17 మంది నామినేషన్లు వేయగా, అందులో నాలుగు నామినేషన్లు పరిశీలనలో తిరస్కరించారు. గురువారం భారతీయ బహుజన్‌ క్రాంతి దళ్‌ పార్టీకి చెందిన అడే బాలాజీ, కాంగ్రెస్‌ రెబల్‌ నరేశ్‌ జాదవ్‌ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పోటీలో 11 మంది మిగిలారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ప్రకటించారు. కాగా, కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి, రెబల్‌గా నామినేషన్‌ వేసిన నరేశ్‌ జాదవ్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఈయన పోటీ చేశారు. ఈసారి  ఎన్నికల్లోనూ పార్టీ టికెట్‌ ఆశించారు. కాని అధిష్టానం రమేశ్‌ రాథోడ్‌కు అవకాశం కల్పించింది. దీంతో అలక వహించిన నరేశ్‌ రెబల్‌గా పోటీ చేశారు.

కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేసి, బీ–ఫారం ఇవ్వకున్నా పోటీకి సై అన్నారు. కాని పార్టీ అధిష్టానం బుజ్జగించడంతో మెత్తబడ్డ ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో పోటీలో పదకొండు మంది అభ్యర్థులు ఉన్నారు. ఇదిలాఉంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోడం నగేశ్, కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ రాథోడ్, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మధ్య ప్రధాన పోరు నెలకొంది. కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో బాపూరావు బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  
పెద్దపల్లి బరిలో 17 మంది 
పెద్దపల్లి లోక్‌సభ బరిలో 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన ఏ అభ్యర్థి కూడా పోటీ నుంచి తప్పుకోకపోవడం గమనార్హం. నామినేషన్ల పరిశీలన అనంతరం మిగిలిన 17 మందిలో ఎవరూ కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. కాగా పెద్దపల్లిలోనూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నడుమ ప్రధాన పోటీ నెలకొంది. చివరి నిమిషంలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి, అనూహ్యంగా టికెట్‌ దక్కించుకున్న బొర్లకుంట వెంకటేశ్, వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి ఎస్‌.కుమార్‌ల మధ్య పోటీ ఉంది. మూడు ప్రధాన పార్టీలు కూడా తమ విజయంపై ధీమాతో ఉన్నాయి. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు.  

ఆదిలాబాద్‌ బరిలో వీరు..  

అభ్యర్థి పేరు   పార్టీ  గుర్తులు
1.గోడం నగేశ్‌   టీఆర్‌ఎస్‌  కారు
2.రమేశ్‌ రాథోడ్‌  కాంగ్రెస్‌   హస్తం
3.బాపూరావు సోయం    బీజేపీ  కమలం
4.కుందం వందన   నవ ప్రజారాజ్యం  ట్రాక్టర్‌ నడిపే రైతు
5.భీమ్‌రావు    అంబేద్కర్‌ రైట్‌ 
    పార్టీ ఆఫ్‌ ఇండియా
   కోటు
6.పవార్‌ కృష్ణ     రాష్ట్రీయ జనక్రాంతి     హెల్మెట్‌
7.ధరావత్‌ నరేందర్‌  జనసేన       గాజుగ్లాసు
8.గంట పెంటన్న     స్వతంత్ర  కుండ
9.కుమ్ర రాజు   స్వతంత్ర    ఉంగరం
10.ఆరె ఎల్లన్న    స్వతంత్ర     బ్యాట్‌
11.నేతావత్‌ రాందాస్‌    స్వతంత్ర    గ్యాస్‌ సిలిండర్‌ 

పెద్దపల్లి బరిలో వీరే..      

పేరు  పార్టీ  గుర్తు
1. వెంకటేశ్‌నేత టీఆర్‌ఎస్‌  కారు
2.డాక్టర్‌ చంద్రశేఖర్‌     కాంగ్రెస్‌  హస్తం
3.ఎస్‌.కుమార్‌  బీజేపీ      కమలం
4.బాలకల్యాణ్‌ పంజా    బీఎస్పీ   ఏనుగు
5. ఎరుగుర్ల భాగ్యలక్ష్మి    పిరమిడ్‌ పార్టీ     పిల్లనగ్రోవి
6. ఎస్‌.కృష్ణ    సెక్యులర్‌ డెమోక్రటిక్‌   బావి
7. రాజ్‌ప్రకాశ్‌  ఇండియా ప్రజాబంధు      ట్రంపెట్‌ 
8. వెలుతురు మల్లయ్య     రిపబ్లిక్‌ పార్టీ     హెలికాఫ్టర్‌
9. సబ్బని కృష్ణ    సీపీఐయూ    కంప్యూటర్‌
10. దేవదాస్‌  యాంటీ కరెప్షన్‌  పనసకాయ
11. అర్షం అశోక్‌    స్వతంత్ర    గ్యాస్‌ సిలిండర్‌
12. కుంటాల నర్సయ్య  స్వతంత్ర     రోడ్డురోలర్‌
13. గద్దల వినయ్‌  స్వతంత్ర    గాజుగ్లాస్‌
14. గొడిశెల్లి నాగమణి   స్వతంత్ర      గౌను
15. దుర్గం రాజ్‌కుమార్‌    స్వతంత్ర      బ్యాట్‌
16. ఎరికిల్ల రాజేశ్‌     స్వతంత్ర   ఓర
17. అంబాల మహేందర్‌     స్వతంత్ర     ట్రాక్టర్‌ నడిపే వ్యక్తి   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top