చంద్రబాబు ప్రతిపక్ష నేత అని మరిచిపోయారు: సీఎం జగన్‌

CM YS Jagan Angry On TDP MlAs In AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం రుణాలపై చర్చ సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో దుమారం రేగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు అడుగడుగునా అడ్డు తగిలారు. దీంతో ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందిస్తూ... సభలో 150మంది ఉన్నామని, తాము తలచుకుంటే టీడీపీ సభ్యులు సభలో కూడా తిరగలేరని అన్నారు. ఈ సందర్భంగా అచ్చెన‍్నాయుడు ప్రసంగానికి అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో సీఎం మాట్లాడుతూ...‘ మనిషి ఆ సైజులో ఉన్నారు. బుర్ర మాత్రం ఆ స్థాయిలో లేదు. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో కూడా తెలియదు. కూర్చో...కూర‍్చో’ అంటూ చురకలు అంటించారు. ‘టీడీపీ సభ్యులు మాట్లాడినంత సేపు మాట్లాడారు. మేము ఓపిగ్గా విన్నాం. నేను మాట్లాడేటప్పుడు మాత్రం టీడీపీ మళ్లీ గందరగోళం సృష్టిస్తోంది. కళ్లు పెద్దవి చేసి చూస్తే మేం భయపడం. తప్పు చేసినవారి తీరు ఎలా ఉంటుందో టీడీపీ సభ్యుల తీరు అలా ఉంది. చంద్రబాబు తాను ప్రతిపక్ష నేత అని మరిచిపోయారు. బుద్ధి, జ్ఞానం ఉండాలి. రైతుల కోసం చర్చ జరుగుతుందని మాత్రమే టీడీపీకి అవకాశం ఇచ్చాం. కానీ టీడీపీ సభ్యులు మాత్రం సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. సున్నా వడ్డీ పథకం పూర్తిగా సున్నా. రైతుల రుణమాపీ కింద రూ.87,621 కోట్లు ఇవ్వాలి. అయిదేళ్లలో రూ.15 వేలకోట్లు ఇచ్చి రుణమాఫీ చేశామని రుణమాఫీపై చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారు’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

మరోవైపు  బడ్జెట్‌ సమావేశాల్లో రెండో రోజు సభలో తెలుగుదేశం ఎమ్మెల్యేల తీరు అభ్యంతరకరంగా మారింది. పలుమార్లు విప్‌, చీఫ్‌ విప్‌తో పాటు స్పీకర్‌ సూచించినా తెలుగుదేశం సభ్యుల తీరు మారలేదు. ప్రతిపక్షనేతకు అడిగిన ప్రతీసారి అవకాశం ఇస్తున్నా.. ఉద్దేశపూర్వకంగా సమావేశాల్లో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ప్రతీసారి టీడీపీ సభ్యులు అరుపులు, కేకలతో సభలో రాద్ధాంతం సృష్టించారు. వీరిని స్పీకర్‌ వారించినా పద్ధతిలో మార్పు రాలేదు. తొలుత సున్నావడ్డీపై అసత్య ప్రకటనలు చేయడమే కాకుండా.. తర్వాత సభను పక్కదారి పట్టించేందుకు టిడిపి ప్రయత్నించింది. మంత్రులు, అధికార పక్ష నేతలు వారిస్తున్నా.. వినకుండా సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే అచ‍్చెన్నాయుడు వ్యవహరిస్తున్న తీరును ప్రభుత్వ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి తప్పుబట్టారు. మరోవైపు స్పీకర్‌ కూడా టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోవాలని సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top