ఇది జాలి లేని ప్రభుత్వం

Chidambaram Speaks In Debate Of Union Budget - Sakshi

ఆహార సబ్సిడీలు, ఉపాధి పథకాలకు భారీగా నిధుల కోత

‘కేంద్ర బడ్జెట్‌’పై చర్చలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అసమర్థమైందే గాక... పేదల వ్యతిరేకమైందని, జాలిలేనిదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం ధ్వజమెత్తారు. వారం రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేదలకు ఉపయోగపడే అన్ని కార్యక్రమాలకూ నిధులు తక్కువగా కేటాయిం చడం దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మఫ్కమ్‌ ఝా ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం ‘కేంద్ర బడ్జెట్‌.. ఆర్థిక పరిస్థితి’’అన్న అంశంపై చిదంబరం ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూ ముంగిట్లోకి చేరిందని, ఈ విషయాన్ని అంగీకరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని విమర్శించారు. బడ్జెట్‌లో దేశ ఆర్థిక స్థితి ఏమిటన్నది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పలేకపోయారని ఆరోపించారు.

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని అమలుతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వెనుకబడిపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు 8.2%గా ఉన్న స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోయిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో చేరేందుకు డిమాండ్‌ లేమి ఒక కారణమైతే... పెట్టుబడిదారులకు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం రెండో కారణమని చిదంబరం అన్నారు. గత కొన్నేళ్లలో ఆటోమొబైల్‌ రంగంలోనే 2 లక్షల మంది ఉపాధి కోల్పోయారని, 296 వర్క్‌షాపులు మూతపడ్డాయన్నారు. ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, జీఎస్టీ, డీఆర్‌ఐ వంటి సంస్థల్లో తక్కువ స్థాయి అధికారులకూ విచక్షణాధికారాలు కట్టబెట్టడంతో కంపెనీలు  వేధింపులు ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కేంద్ర మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, సామాజిక కార్యకర్త డాక్టర్‌ సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేదలు మరింత పేదరికంలోకి..
గతేడాది బడ్జెట్‌లో అంచనాలు... పెట్టిన ఖర్చుల్లో భారీ అంతరం ఉందని, పన్ను వసూళ్లలో రూ.లక్ష కోట్ల వరకూ తగ్గుదల ఉంటే.. పెట్టిన ఖర్చు కూడా రూ.లక్ష కోట్ల వరకూ తక్కువగా ఉండటాన్ని మాజీ ఆర్థిక మంత్రి వివరించారు. కార్పొరేట్‌ ట్యాక్స్, ఆదాయపు పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ వసూళ్లు రూ.లక్షల కోట్లు తక్కువగా ఉండటం ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందనేందుకు ప్రత్యక్ష సాక్ష్యాలని చిదంబరం తెలిపారు. వ్యవసాయానికి, ఆహార సబ్సిడీ నిధుల్లో కోత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని పేదలు మరింత పేదరికంలోకి చేరే ప్రమాదముందని హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top