నిర్మలా ఆర్థిక ప్యాకేజీపై చిదంబరం మండిపాటు

Chidambaram Fires On Nirmala Sitharaman Economic Package - Sakshi

సాక్షి, అమరాతి : సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మండిపడ్డారు. దేశంలోని మొత్తం 6.3 కోట్ల ఎంఎస్ఎంఈల్లో 45 లక్షల ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే నిర్మలా ప్యాకేజీ అనుకూలంగా ఉందని విమర్శించారు. ఆ రోజు ప్రకటించిన ప్యాకేజీలో వలస కూలీలకు వాటా లేకపోవడాన్ని బాధాకరమని అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అలమటిస్తూ వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న వలస కార్మికుల గురించి ప్రస్తావించకపోవడం, వారిని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలోని పేదలకు డబ్బుల పంపిణీలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు.  13 కోట్ల కుటుంబాలు లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయాయని, ప్రభుత్వ సాయం వారిని ఈ కష్టాల నుంచి కాపాడలేకపోయిందని చిదంబరం అన్నారు.( చదవండి : ఈపీఎఫ్‌: 3 నెలలు పొడిగింపు.. రూ. 2500 కోట్లు)

‘ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ఇప్పటి వరకు కేంద్రం 3.6 లక్షల కోట్లు మాత్రమే ప్రకటించింది. మిగిలిన 16.4 లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయి?  ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాలి. కానీ అలా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎక్కువ రుణాలు తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం అలా చేయదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ రుణాలు తీసుకోవాడానికి, ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడానికి అనుమతించాలి. కానీ ఈ ప్రభుత్వం ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు’ అని చిదంబరం విమర్శించారు. 
(చదవండి : ఆర్థిక ప్యాకేజీ: చిదంబరం స్పందన)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top