నాయకత్వాన్ని మార్చండి.. | Sakshi
Sakshi News home page

నాయకత్వాన్ని మార్చండి..

Published Wed, Jun 20 2018 1:38 AM

Change the leadership in Congress - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై పార్టీలో అసంతృప్తి క్రమంగా సెగలుగక్కుతోంది. పీఠంపై కన్నేసిన ఆశావహులు పలువురు ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తమ్‌ మూడున్నరేళ్ల పనితీరు బాగా లేదని, ప్రజల్లోనూ శ్రేణుల్లోనూ పార్టీ పట్ల నమ్మకం సడలుతోందని అధ్యక్షుడు రాహుల్‌కు, ఇతర పెద్దలకు వివరించాలని నిశ్చయించారు. రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకంటూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్కతో పాటు గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు సహా దాదాపు 21 మంది నేతలు మంగళవారం ఢిల్లీ వచ్చారు.

వారంతా బుధవారం ఉదయం 10.15కు ఆయనతో భేటీ అవనున్నారు. పార్టీ పరిస్థితిని వీలైతే రాహుల్‌కే నేరుగా చెప్పాలని, లేదంటే పార్టీ పెద్దల వద్ద ప్రస్తావించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉత్తమ్‌ను తప్పించేందుకు అవసరమైతే అంతా ఏకం కావాలని నేతలంతా మంగళవారం మంతనాలు సాగించినట్టు సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కుంతియాతో లాభం లేదని, ఆజాద్‌ వంటి బలమైన మైనారిటీ నేత కావాలని కూడా పలువురు నేతలు భావిస్తున్నారు. సౌమ్యుడన్న ఉద్దేశంతోనే ఉత్తమ్‌ నాయకత్వాన్ని గ్రూపులకతీతంగా అంగీకరిస్తే ఇప్పుడాయన తానే పార్టీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పీసీసీ సీనియర్‌ నేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఆయనకసలు పోరాట పటిమే లేదని ఆక్షేపించారు.

అధికారం తన వద్దకే నడుచుకుంటూ రావాలనుకునే వారితో పార్టీ ముం దుకు సాగదంటూ విమర్శించారు. అధికార పార్టీ నేతలు నిత్యం ప్రజల్లో ఉంటూంటే విపక్ష పార్టీ నేత లు ఇళ్లకు, పార్టీ కార్యాలయాలకు పరిమితమైతే ప్రజ లెలా నమ్ముతారని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ నేత ప్రశ్నించారు. నాయకులకు పనే లేకుండా పోయిందని, ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా పర్మిషన్లు కావాలంటే ఎలాగని ఓ యువ నేత వాపోయారు.

Advertisement
Advertisement