నరేంద్ర మోదీపై నిప్పులుచెరిగిన చంద్రబాబు

Chandrababu Naidu Attack On Narendra Modi At TDP Mahanadu - Sakshi

సాక్షి, విజయవాడ: ‘కూరిమి గల దినములలో...’ అంటూ అవకాశవాద స్నేహాలను గురించి బద్దెన చెప్పిన పద్యం గుర్తుందిగా! ‘పెద్ద నోట్లు రద్దు చేయమని ప్రధాని మోదీకి సలహా ఇచ్చి, జీఎస్టీతో దేశం బాగుపడుతుందని చెప్పి, ఏపీకి కేంద్రం ఎక్కువే ఇచ్చిందని పలికి, ‘బ్రీఫ్డ్‌ మీ’ ఆడియోతో తనకు సంబంధంలేదన్న నారా చంద్రబాబు నాయుడు అలవాటైన పద్ధతిలోనే మళ్లీ మాట మార్చారు. ఆదివారం విజయవాడలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ప్రసంగించిన ఆయన.. తన తాజా మాజీ స్నేహితుడు మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీచేయలేని చంద్రబాబు.. బీజేపీని వీడిన తర్వాత కాంగ్రెస్‌తో కాపురానికి సిద్ధపడుతుండటం తెలిసిందే.

పథకాలతో ఎవరైనా బాగుపడ్డారా?: ‘‘మోదీకి మాటలెక్కువ.. చేతలు తక్కువ. బీజేపీ పథకాలతో ఎవరైనా బాగుపడ్డారా? నోట్ల రద్దుతో వ్యవస్థ నిర్వీర్యమైపోయింది.. జనం బ్యాంకుల చుట్టూ తిరిగే దౌర్భాగ్యం దాపురించింది. జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడింది. మొత్తంగా మోదీ చర్యలతో పాలన గాడితప్పింది. కలుషిత రాజకీయాలు చేస్తోన్న బీజేపీ.. కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరాలాడుతూ ఆడియో టేపులద్వారా అడ్డంగా దొరికిపోయింది. 2019లో బీజేపీ అధికారంలోకి రానేరాదు’’ అని చంద్రబాబు అన్నారు. తద్వారా బద్దెన పద్యాన్ని మరోసారి రుజువుచేశారు.

వెంకన్న జోలికెళ్తే ఈ జన్మలోనే శిక్ష: సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు ప్రసంగంలో శ్రీవారి ఆభరణాల మాయం అంశాన్ని కూడా తట్టారు. వెంకన్న జోలికి వెళితే ఈ జన్మలోనే శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సీఎం గుర్తుచేసుకున్నారు. మహానాడు అంటే తెలుగు జాతికే పండుగ అని, అలాంటి టీడీపీని బీజేపీ కబ్జా చేయాలని చూస్తున్నదని ఆయన మండిపడ్డారు. బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు రిజర్వేషన్‌ కల్పించానని, ఎన్నడూ లేనంతగా మైనారిటీలకు నిధులు పెంచానని, అగ్రవర్ణ పేదలనూ ఆదుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

2022నాటికి ఏపీ అగ్రగామి: ‘‘హేతుబద్ధత లేకుండా కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విడగొట్టింది. ఇచ్చిన హామీలను అమలుచేయలేదు. అయినాసరే నేను కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళుతున్నాను. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే విద్యుత్‌ లోటును అధిగమించాం. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఆ విధంగా ముందుకు వెళుతూ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా నిలుపుతాం..’’ అని చంద్రబాబు అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top