అంతన్నాడు.. ఇంతన్నాడే చంద్రబాబు

chandrababu Give Fake Promises For Mori Villagers - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ : అంతన్నాడు.. ఇంతన్నాడు.. గంగరాజు అనే పాటను తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామస్తులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు తీరే ఆ పాటను గుర్తుచేస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మోరి గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్మార్ట్‌ విలేజ్‌గా ప్రకటించారు. 2016 డిసెంబర్‌ 29న మోరి గ్రామంలో భారీగా బహిరంగ సభలో ఆర్భాటంగా ప్రకటన చేశారు. ఫైబర్‌గ్రిడ్‌తో అనుసంధానమని, రాష్ట్రంలోనే తొలి పూర్తి నగదురహిత లావాదేవీల గ్రామమని, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామమని ప్రకటించారు. సీఎం ప్రకటనలు చూసి ఇక మోరి గ్రామ స్వరూపమే మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అమలులో మాత్రం అదంతా ఉత్తిదేనని తేలిపోయింది. 

పనిచేయని ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్షన్‌లు
 రాష్ట్రంలోనే తొలిసారిగా ఫైబర్‌ గ్రిడ్‌ను మోరి గ్రామానికి అందించారు. 1,500 ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరుచేసింది. ప్రతి ఇంటికీ నెలకు రూ.149కే టీవీ, ఇంటర్నెట్‌ సౌకర్యం అన్నారు. ఆ కనెక్షన్లను స్థానిక కేబుల్‌ ఆపరేటర్లు ఫైబర్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. అయితే ఇందులో 300 కనెక్షన్లకు ఐపీటీవీ (టీవీకి, ఫోన్‌కు పవర్‌ సప్లయి చేసే బాక్సులు) బాక్స్‌ల్లో వచ్చిన సాంకేతిక లోపాల వల్ల ప్రారంభంలోనే ఇన్‌స్టాల్‌ కాలేదు.  

పనిచేయని ఫోన్లు, కానరాని నగదు రహిత లావాదేవీలు
నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు మోరిలో 600 మందికి స్మార్ట్‌ ఫోన్‌లు అందజేశారు. ఇచ్చిన కొన్ని రోజులకే ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అవడం, బ్యాటరీ ఉబ్బిపోవడం, తదితర సమస్యలతో చాలావరకు పనికిరాకుండా పోయాయి. గ్రామంలో మెడికల్, కిరాణా, కూరగాయలు, పాన్‌షాప్‌.. ఇలా అన్నీ కలిపి 39 వరకూ ఉన్నాయి. నగదురహిత లావాదేవీలంటూ కేవలం నలుగురికి మాత్రమే స్వైపింగ్‌ మిషన్లు ఇచ్చింది. ప్రస్తుతం అవి కూడా వినియోగించని పరిస్థితి నెలకొంది.దీంతో ప్రస్తుతం నగదు లావాదేవీలే జరుపుతున్నారు. 

స్వచ్ఛభారత్‌కు తూట్లు 
సంపూర్ణ పారిశుధ్యంలో భాగంగా నూరుశాతం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా మోరిని ప్రకటించారు. ఇందులో భాగంగా గ్రామంలో తొలి విడతగా 456 మరుగుదొడ్లు లేని నివాసాలను గుర్తించారు. ఇందులో నాలుగేళ్లలో 430 పూర్తిచేశారు. ఈలోపు కొత్తగా మరుగుదొడ్ల కోసం మరో 100 దరఖాస్తులు వచ్చాయి. బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ప్రకటించినా అక్కడింకా మరుగుదొడ్లు లేని ఇళ్లు ఉన్నాయి. గ్రామాల్లో ఇంకా బహిరంగ మల విసర్జన కొనసాగుతూనే ఉంది.దీంతోపాటు ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోతోంది. 

టీవీ కనెక్షన్లకు సాంకేతిక లోపాలు 
‘‘ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ అమలు ప్రారంభంలోనే టీవీకి ఫైబర్‌ కేబుల్‌ వేసి కనెక్షన్‌ ఇచ్చారు. అయితే కొద్ది రోజులకే ఔటాఫ్‌ ఆర్డర్‌ అని వస్తోంది. టీవీని ఆన్‌ చేసిన వెంటనే స్క్రీన్‌పై నో ఇంటర్నెట్‌ ఏక్సెస్‌ అని వస్తుంది. ఇలా ఉంది మా ఊళ్లో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌’’ అని చెబుతున్నారు గ్రామస్తులు.

మోరి ప్రజలకు సినిమా చూపించారు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మా ఊళ్లో భారీ బహిరంగ సభ పెట్టారు. స్మార్ట్‌ విలేజ్‌ అన్నారు. మోరి ప్రజలకు సినిమా చూపించారు. ఆయన చెప్పినవేవీ ఇక్కడ అమలు కాలేదు.  
–జాన శంకరరావు, మాజీ సర్పంచ్, మోరి, సఖినేటిపల్లి మండలం 

– కందుల శివశంకర్‌, సాక్షి ప్రతినిధి, కాకినాడ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top