‘అడ్డగోలుగా దోచుకుంటున్నారు’

Botsa Satyanarayana Slams Guntur Tdp Mlas - Sakshi

టీడీపీ ఎమ్మెల్యేలపై బొత్స సత్యనారాయణ ఆరోపణలు

సాక్షి, గుంటూరు : జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినా యథేచ్చగా దోపిడీ చేస్తున్నారని తెలిపారు. మరో టీడీపీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్‌ ఇసుక మాఫియాతో కోట్లు దోచుకుంటున్నారని, ధూళిపాళ్ల నరేంద్ర నీరు చెట్టు పథకంతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మిగిలిన ఎమ్మెల్యేలు పంచభూతాలను వదలకుండా తినేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ఎక్కడ చూసిన అవినీతి కంపు కొడుతుందన్నారు. గుంటూరు జిల్లాలో శాంతి భద్రతలే లేవన్నారు.

రాష్ట్రంలో 400 మండలాలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు రైతాంగం సంక్షోభంలో ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం రూ.1600 కోట్లతో రెయిన్‌ గన్స్‌తో దోపిడీకి సిద్దమయ్యారని ఆరోపించారు. ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమా మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. లక్షలాది ఎకరాల్లో సాగు తగ్గి, రైతులు పంట నష్టపోయినా ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. రైతాంగానికి తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భరోసా ఇస్తున్నారని తెలిపారు. ఈ అరాచకాలు, దోపిడీ, అవినీతిపై తమ పోరాటం కోనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనకు నిరసనగా రేపు గుంటూరులో వంచనపై గర్జన నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష ఉంటుదని, ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ మోసాలను ఎండగడతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలంతా హాజరవుతారని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top