‘అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేయటానికే వారి కుట్రలు’

Botsa Satyanarayana Comments On Chandrababu Over Agrigold - Sakshi

సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేయటానికే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్‌లు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్సా సత్యనారాయణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 20 లక్షల అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ప్రభుత్వం ఆటకెక్కించిందని మండిపడ్డారు. తాము పోరాటం చేస్తుంటే ప్రభుత్వం హడావిడి చేస్తోందని విమర్శించారు. 1183 కోట్లు ఇస్తే 80 శాతం మందికి న్యాయం జరుగుతుందని, కానీ ప్రభుత్వం దగ్గరనుంచి స్పందన లేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

క్యాబినేట్ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశం లేదని, కానీ టీడీపీ గెజిట్ పత్రికల్లో అగ్రిగోల్డ్ బాధితులకు 250 కోట్లు.. అని రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ అగ్రిగోల్డ్ అంశం ఎక్కడా తేకపోవడం దురదృష్టకరమన్నారు. సీబీసీఐడీ వెంటనే అగ్రిగోల్డ్ ఆస్తుల లిస్ట్ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ వాచ్‌డాగ్‌లా అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాపాడిందని తెలిపారు. ఫిబ్రవరి 4న విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. బినామీ ఆస్తులు ఎందుకు సీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. ‘అఖిలపక్షం కాదు.. పక్షాలు పోయాయి, పక్షులు మిగిలాయి.. టీడీపీ ఏకాకిగా మిగిలింది’ అంటూ ఎద్దేవా చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top