పోలవరంపై డ్రామాలు కట్టిపెట్టండి

Botsa satyanarayana commented over chandrababu - Sakshi

ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెప్పాలి

గడ్కరీ ప్రశ్నలకు చంద్రబాబులో వణుకెందుకు?

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచన ఉందా? అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. నిజంగా చిత్తశుద్ధే ఉంటే ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తిచేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి పోలవరంపై వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు పలికారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం బొత్స మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం నిర్మాణానికి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన హయాంలోనే రూ. 5 వేల కోట్లు ఖర్చుపెట్టి, కాల్వల నిర్మాణం కూడా పూర్తిచేశారని గుర్తుచేశారు.

రాష్ట్ర విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి తామే పూర్తి చేస్తామని కేంద్రం చెప్పినా.. కమీషన్లకు కక్కుర్తిపడి, హోదాను తాకట్టు పెట్టి చంద్రబాబు నిర్మాణాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు లాలూచీ వ్యవహారం తెలుసు కాబట్టే కేంద్రం కూడా అంగీకరించిదని తెలిపారు. ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర మంత్రి గడ్కరీ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక చంద్రబాబు భయంతో వణికిపోయారని బొత్స ఎద్దేవా చేశారు.

నిర్మాణ వ్యయంపై మొదటి, రెండో సమగ్ర నివేదికకు తేడా ఉండటాన్ని ఆయన లేవనెత్తారని, భూమి, నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగిందో చెప్పమన్నారని, వీటిని పరిశీలిస్తే అసలు ప్రాజెక్టు పూర్తిచేసే లక్ష్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అసలీ ప్రాజెక్టు డీపీఆర్‌ను పదేపదే ఎందుకు మారుస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరాన్ని పక్కనబెట్టి పట్టిసీమతో ఎన్నికల్లో డబ్బు సంచులందించిన కాంట్రాక్టర్ల జేబులు నింపారన్నారు.

పెట్టుబడుల్లో డ్రామా!
సులభతర వాణిజ్యంలో ఏపీకి నెంబర్‌ వన్‌ స్థానం దక్కిందని చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని బొత్స తిప్పికొట్టారు. ఆయన గతంలో, ఇప్పుడు కలిపి 13 ఏళ్లు అధికారంలో ఉన్నారని, ఈ కాలంలో అత్యధికంగా ఉపాధి కల్పించే ఎన్ని పరిశ్రమలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్‌ ఐదేళ్ల కాలంలో ఎన్నో పరిశ్రమలొచ్చాయని, అందులో ఒక్క బ్రాడిక్స్‌ అనే కంపెనీ 16 వేల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. విశాఖలో నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుల ద్వారా లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నారని, వాస్తవాలను పరిశీలిస్తే ఏమాత్రం పోలికే ఉండటం లేదన్నారు.  జగన్‌ పాదయాత్ర ఇచ్ఛాపురం చేరేసరికి టీడీపీమూతపడటం ఖాయమని బొత్స వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top