సోము వీర్రాజు వ్యాఖ్యలు శుద్ధ అబద్ధం..

Bonda Uma Counter Attack to Somu Veerraju comment - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కౌంటర్‌ ఇచ్చారు. ఏపీకి కేంద్రం సాయంపై సోము వీర్రాజు వ్యాఖ్యలు శుద్ధ అబద్ధమని, అంతేకాకుండా ఏపీలో బీజేపీ ఒంటరిగా ఎప్పుడు ఎదగలేదని ఆయన అన్నారు. భవిష్యత్‌లో బీజేపీ ఎదుగుతుందని అనుకోవడం వాళ్ల అత్యాశేనని బోండా ఉమా వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు ఒంటరిగా రాజమండ్రిలో పోటీ చేస్తే కౌన్సిలర్‌గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తే 15 లక్షల ఓట్లకు కేవలం 7వేల ఓట్లు మాత్రమే వచ్చాయని బోండా ఉమా గుర్తు చేశారు. ఏపీకి అన్ని ఇచ్చాం, ఇన్ని ఇచ్చామని చెబుతున్నారని, 2016లో అరుణ్‌ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఒక్క రూపాయి అన్న రాష్ట్రానికి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.

వెనుకబడిని జిల్లాలకు బుదేల్ ఖండ్, కలహాండి ప్యాకేజీ తరహాలో ఇస్తామన్నారని అవన్నీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. రూ.24వేల కోట్లకుగానూ కేంద్రం కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్ర రాజధానికి రైతులు రూ.50వేల కోట్లు విలువ చేసే భూమి ఇస్తే బీజేపీ రూ.1500కోట్లు ఇచ్చిందని బోండా ఉమా అన్నారు. వాటితో ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. వ్యక్తిగత ఎజెండాతోనే సోము వీర్రాజు పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ...టీడీపీని మోసం చేసిందని అయిదు కోట్ల ప్రజలు అంటున్నారని, వారికి సోము వీర్రాజు సమాధానం చెప్పాలని బోండా ఉమా డిమాండ్‌ చేశారు.

కాగా ఏపీ రాజధాని నిర్మాణం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం..రూ.16వేల కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top