కమలదళం వలస బలం!  | Sakshi
Sakshi News home page

కమలదళం వలస బలం! 

Published Fri, Sep 13 2019 4:00 AM

BJP Trying To Implement Operation Akarsh For TRS MLAs - Sakshi

రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. భారీగా బలగాన్ని సమకూర్చుకొనే పనిని చాప కింద నీరులా చేసుకుపోతోంది. ఇప్పటికే తెలంగాణ టీడీపీని ఖాళీ చేయించిన బీజేపీ.. అడపాదడపా కాంగ్రెస్‌ నేతలను ఆకర్షించడమే కాక ఇప్పుడు ఏకంగా అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపైనా కన్నేసింది. అసంతృప్తితో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను రాజకీయ వర్గాల్లోకి పంపాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌ : అటు ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణ, ఇటు ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ఏక కాలంలో అమలు చేయడం ద్వారా రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో బలీయమైన రాజకీయ శక్తిగా అవ తరించాలన్నదే బీజేపీ  లక్ష్యంగా కనిపి స్తోంది. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌తో అధికార పార్టీలో ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ను ప్రారంభించిన ఆ పార్టీ... రాష్ట్ర ప్రభుత్వం పైనా పోరాటాలకు సిద్ధమవు తోంది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్‌ నేతలు కూడా రాష్ట్ర బీజేపీలో ఇమడలేకపోతున్నా రనే విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలోకి వచ్చే నాయకులను ఏ మేరకు కలుపుకొనిపోతారు... ఎంతకాలం వారు పార్టీలో ఉండగలుగుతారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.

లోక్‌సభ ఎన్నికల నుంచే..
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో దూకు డుగా వ్యవహరించలేకపోయిన తెలంగాణ బీజేపీ... లోక్‌సభ ఎన్నికల సమయంలో వ్యూహాలను అమల్లోకి తెచ్చింది. బలమైన అభ్యర్థులను దింప డం, కాంగ్రెస్‌ పార్టీలోని కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. అలాగే మరో చోట పెద్ద ఎత్తున ఓటు బ్యాంకును సమకూర్చుకుంది. లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజలు పట్టం కట్టడంతో అదే ఊపును కొనసాగిస్తూ గత ఆరేడు నెలలుగా ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమున్న రాష్ట్రమన్న అంచనాతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన వ్యూహాలకు అనుగుణంగా పార్టీ రాష్ట్ర శాఖ పక్కా కార్యాచరణతో ఇప్పటికే అనేక మంది నేతలను కమలదళంలో చేర్చుకోవడంలో సఫలీకృతమైంది. టీ టీడీపీకి చెందిన ముఖ్య నేతలందరినీ పార్టీలో చేర్చుకోవడంతోపాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నియోజకవర్గ స్థాయి నేతలను కూడా అక్కున చేర్చుకుంది. ఆ రెండు పార్టీల్లో ఇంకా వీలైనంత మందిని పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలను కొనసాగిస్తూనే అధికార టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తిని కూడా సొమ్ము చేసుకొని రాజకీయంగా ఎదిగే వ్యూహాలను అమల్లోకి తెస్తోంది.

షకీల్‌తో ‘షురూ’?
అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్‌ లోకి వెళ్లారని, త్వరలోనే వారు అమిత్‌ షా సమక్షంలో కమలం గూటికి చేరతారని 4–5 రోజుల నుంచి సోషల్‌ మీడి యాలో ప్రచారం జరుగు తోంది. ఈ ప్రచారానికి తగ్గట్లు గానే గురువారం బోధన్‌ ఎమ్మెల్యే ఫకీల్, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ల భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృ ప్తితో ఉన్న షకీల్‌ బోధన్‌ లాంటి సమస్యాత్మక నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ బీజేపీ నేతతో భేటీ కావడం, అన్ని విషయాలను సోమవారం వెల్లడిస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో షకీల్‌ బీజేపీలో చేరడం లాంఛనమేనని, షకీల్‌తోపాటు మరికొందరు ఎమ్మె ల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా టచ్‌లో ఉన్నా రని బీజేపీ వర్గాలంటున్నాయి. అయితే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో నేరుగా ఢిల్లీ నేతలే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

కనీసం ఐదుగురు ఎమ్మె ల్యేలు పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని కమలనాథులంటు న్నారు. వారంతా అమిత్‌ షా సమ క్షంలో పార్టీలోకి వస్తారని చెబుతున్నారు. వారితో పాటు కొందరు ముఖ్య కాంగ్రెస్‌ నేతలను కూడా పార్టీలో చేర్చుకునే ప్రణాళికలు... ఢిల్లీ నుంచే అమలు జరుగుతుండ టంతో త్వరలోనే తమకు మరింత బలం సమకూరు తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే తమ లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేయాలని ఇప్పటికే జాతీయ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు. అందులో భాగంగానే టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తమతో మాట్లాడుతున్నారని, 2022కల్లా రాష్ట్రంలో పేరున్న రాజకీయ నాయకులకు తమ పార్టీ చిరునామాగా మారబోతోందని బీజేపీ ముఖ్య నేత ఒకరు వెల్లడించడం ఆ పార్టీ వ్యూహాన్ని తెలియజేస్తోంది.

త్వరలోనే ‘పాదయాత్ర’!
ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడంతోపాటు ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాలన్న కోణంలో బీజేపీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుడతారని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరిస్తారని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రధానాస్త్రంగా ఉపయోగించుకోవాలని, రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఇది టానిక్‌గా ఉపయోగపడుతుందని బీజేపీ శిబిరం అంటోంది. అందులో భాగంగానే ఈ నెల 17న విమోచన దినోత్సవానికి అమిత్‌ షాను రప్పించాలని రాష్ట్ర నాయకులు ఇప్పటికే జాతీయ పార్టీకి ప్రతిపాదనలు కూడా పంపారు. దీనికితోడు మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తేనే పార్టీలో చేరికలుంటాయనే అంచనాలో ఉన్న కమలనాథులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేలా పావులు కదుపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎలాగూ తమకు సానుకూలత ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఈ ఎన్నికలను ఎదుర్కొంటామని, తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తామని భరోసా వ్యక్తం చేస్తున్నారు.

వలస నేతలు ఉండగలుగుతారా...?
ఇతర పార్టీ నుంచి వచ్చి చేరే వలస నేతలను బీజేపీలో కలుపుకొని పోరనే అభిప్రాయం ఉంది. నాగం జనార్దన్‌రెడ్డి లాంటి నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా రాజకీయ వర్గాలు చర్చిస్తుంటాయి. మొదటి నుంచీ బీజేపీలో ఉన్న నేతలే పాతుకుపోయారని, పార్టీ, ప్రభుత్వంలో పదవులు కూడా వారికే వస్తాయనే అపవాదు కూడా ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన డి.కె. అరుణ లేదా ఇతర నేతలకు ఇన్నాళ్లయినా ఎలాంటి అవకాశం కల్పించలేదని, అమిత్‌ షా సమక్షంలో పార్టీలో చేరిన వారికైనా ఏదో ఒక పదవి లేదా హోదా ఇచ్చి ఉంటే వలస నేతలకు భరోసా ఉండేదనే అభిప్రాయం అంతర్గతంగా బీజేపీలోనూ వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement