తేరే మేరే బీచ్‌ మే

BJP proposes new formula to break deadlock with Shiv Sena - Sakshi

బీజేపీ శివసేన మధ్య ఏదో తెలియని బంధముందన్న ‘మహా’మంత్రి

త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ఫడ్నవీస్‌

సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: తేరే మేరే బీచ్‌ మే కైసా హైయే బంధన్‌ అంజానా. ఇదీ 1981లో విడుదలైన హిందీ చిత్రం ఏక్‌ దూజే కేలియేలో సూపర్‌ హిట్‌ సాంగ్‌. నీకూ, నాకూ మధ్య ఎంత వింత అనుబంధం ఉంది. అదేంటో నీకూ తెలీదు, నాకూ తెలీదు అన్న అర్థంలో ఆ పల్లవి సాగుతుంది. మహారాష్ట్ర బీజేపీ మంత్రి సుధీర్‌ ముంగన్‌తివార్‌ ఈ పాటను గుర్తుకు చేస్తూ బీజేపీ, శివసేన మధ్య అధికారాన్ని పంచుకోవడంలో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ ఇరుపార్టీల మధ్య ఏదో తెలియని బంధముందని వ్యాఖ్యానించారు.

శాసనసభా పక్ష నాయకుడిగా ఫడ్నవీస్‌  
మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా బుధవారం నాడు దేవేంద్ర ఫడ్నవీస్‌ మరోసారి ఎన్నికయ్యారు. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, పార్టీ ఉపాధ్యక్షుడు అవినాష్‌ రాయ్‌ ఖన్నాల సమక్షంలో అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 105 మంది ఎమ్మెల్యేలు సమావేశమై తమ నాయకుడిగా ఫడ్నవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకం ఉంచిన ఎమ్మెల్యేలకు ఫడ్నవీస్‌ కృతజ్ఞతలు తెలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.  

శివసేన లేకుండా ప్రభుత్వమే లేదు: ఫడ్నవీస్‌
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో వచ్చిన ప్రత్యామ్నాయాలన్నింటినీ దేవేంద్ర ఫడ్నవీస్‌ ఒక్క వ్యాఖ్యతో తోసిపుచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత ఫడ్నవీస్‌ మాట్లాడుతూ ప్రత్యామ్నాయం గురించి బయటకు వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని, కేవలం వినోదం కోసమే వాటిని ప్రచారం చేశారని అన్నారు. ‘ఎన్నికల్లో ప్రజలు బీజేపీ–శివసేన కూటమికే ఓట్లు వేశారు. పూర్తి స్థాయి మెజార్టీని అప్పగించారు.

అందుకే ఆ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 56 స్థానాలు గెలిచిన శివసేన ఆరుగురు స్వతంత్రుల మద్దతుతో బలాన్ని 62కు పెంచుకుంది. తమ గౌరవానికి భంగం కలగకుండా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం శివసేనకు అవసరమని ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ చెప్పారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన కొంచెం మెత్తబడినట్లయిందని భావిస్తున్నారు.

ఎన్సీపీ, కాంగ్రెస్‌లది ప్రతిపక్ష పాత్రే..
ప్రజా తీర్పుకి అనుగుణంగా కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రతిపక్షంలోనే కూర్చుంటాయని మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్‌ జయంత్‌ పాటిల్‌ స్పష్టం చేశారు. శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతునిస్తాయని ఊహాగానాలు రేగుతున్న నేపథ్యంలో పాటిల్‌ ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమని తీర్పు ఇచ్చారు. మేము దానిని పాటిస్తాం‘‘అని పాటిల్‌ చెప్పారు. ఎన్సీపీలో మరో కీలక నాయకుడు అజిత్‌ పవార్‌ మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ సరైన దారిలో వెళ్లేలా చేస్తామని అన్నారు.

శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి?
ఉప ముఖ్యమంత్రి సహా ఇతర కీలక శాఖల్ని శివసేనకు అప్పగించడానికి బీజేపీ ముందుకొచ్చింది. ఈ మేరకు శివసేన పార్టీతో మంతనాలు సాగిస్తోందని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో కూడా మంత్రి పదవులు ఇవ్వడానికి సిద్దమైందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హోంశాఖ, ఆర్థిక, రెవిన్యూ శాఖ బీజేపీ తన దగ్గర ఉంచుకోనుందని ప్రచారం జరిగింది.

మహా కార్టూన్‌
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య ప్రతిష్టంభనకు ఈ కార్టూన్‌ అద్దం పడుతోంది. బీజేపీ గుర్తు కమలంపై, శివసేన గుర్తు బాణం వేళ్లాడుతున్నట్టుగా వేశారు. దాని కింద క్యాప్షన్‌ రూపంలో ఒక సామెత ఉంది. ‘మెడపై కత్తి వేలాడుతోంది’ అని మరాఠీలో రాశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top