
సాక్షి,గుంటూరు : చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసం అక్రమమని, దాన్ని తక్షణమే ఖాళీ చేయాలని బీజేపీ నేత, నెహ్రూ యువజన కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి పేర్కొన్నారు. మరి కొద్దిరోజుల్లో టీడీపీలో చంద్రబాబు, లోకేష్ తప్ప ఎవరు మిగలరని ఎద్దేవా చేశారు. టీడీపీ ఇక తెలుగు దొంగల పార్టీగా పేరు పొందిందని, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చాలని స్పష్టం చేశారు.ఆ పార్టీకి చెందిన నేతలంతా తొందర్లోనే తీహార్ జైలుకు వెళ్లక తప్పదని అందుకే వారంతా హిందీ నేర్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ మిత్రపక్షమైన కాంగ్రెస్ నేతలు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ ట్రేడింగ్ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు.